సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ శాఖ ఆటంకంగా మారకూడదని, ప్రజలకు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఈ స్థాయిలో అటవీ శాఖపై ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారని అన్నారు.పోలీసు శాఖ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారింది, కానీ అటవీ శాఖ మారలేదు. మారాల్సిన అవసరం ఉంది. కలెక్టర్లు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించకపోతే ఎలాగని ఆయన ప్రశ్నించారు. ఇటీవల నడక మార్గంలో శ్రీశైలం వెళుతున్న భక్తులను అటవీ అధికారులు అడ్డుకోవడం, బద్వేలులోనూ ఇదే తరహాలో వ్యవహరించడం వంటి ఘటనలను ఆయన ఉదహరించారు. అధికారుల ఆచరణ సాధ్యం కాని ఆలోచనల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు.అటవీ అధికారులు తమ పరిధిలోని జిల్లా కలెక్టర్ల కింద పనిచేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పర్యావరణహిత ప్రాజెక్టులకు నిబంధనల మేరకు సహకరించాలే తప్ప, అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలిగించవద్దని ఆదేశించారు. గ్రీన్ కవర్ పెంచడం, జీవవైవిధ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని, ప్రజలను ఇబ్బంది పెట్టే చర్యలు మానుకోవాలని ఆయన తేల్చిచెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa