ట్రెండింగ్
Epaper    English    தமிழ்

Redevelopment Plan: ఢిల్లీలో 7 గవర్నమెంట్ కాలనీలకు కొత్త కళ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 07, 2026, 11:14 PM

ఢిల్లీలోని పాత ప్రభుత్వ నివాస కాలనీలను ఆధునికంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్టు కోసం ప్రజల నుంచి పన్నుల రూపంలో వచ్చిన డబ్బును వినియోగించకుండా స్వీయ నిధులతోనే పనులు చేపట్టడం విశేషం.సరోజినీ నగర్, నేతాజీ నగర్, నౌరోజీ నగర్, కస్తూరిబా నగర్, త్యాగరాజ్ నగర్, శ్రీనివాసపురి, మహమ్మద్‌పూర్ వంటి ప్రాంతాల్లో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సుమారు 537 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కాలనీలను పూర్తిగా పునర్నిర్మించి ఆధునిక సదుపాయాలతో కొత్తగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ ప్రాంతాల్లోని అనేక ఇళ్లు చాలా కాలం క్రితమే నిర్మించబడటంతో ప్రస్తుతం పాడైపోయి నివాసానికి అనుకూలంగా లేని స్థితికి చేరుకున్నాయి. దాదాపు 40 శాతం ఇళ్లు ప్రమాదకరంగా మారినట్లు అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మరో 20 వేలకుపైగా నివాసాల కొరత కూడా ఉంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పాత చిన్న భవనాల స్థానంలో అన్ని సౌకర్యాలతో కూడిన ఆధునిక అపార్ట్‌మెంట్లను నిర్మించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు 21,000 కొత్త ఇళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మార్చి 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్మాణం పూర్తైన 2,722 కొత్త ఫ్లాట్లను ప్రారంభించనున్నారు.ఇదే సమయంలో సరోజినీ నగర్, నేతాజీ నగర్ ప్రాంతాల్లో మరో 6,632 ఇళ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 537 ఎకరాల్లో సుమారు 13 శాతం భూమిని, అంటే దాదాపు 69 ఎకరాలను వ్యాపార సంస్థలు లేదా ప్రైవేట్ నివాసాల కోసం కేటాయించి నగదుగా మారుస్తారు.ఈ భూముల విక్రయం ద్వారా సుమారు రూ.35,100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కొత్త ఇళ్ల నిర్మాణానికి దాదాపు రూ.32,800 కోట్లు ఖర్చవుతాయని అధికారులు చెబుతున్నారు. అంటే నిర్మాణ వ్యయం పోయినా ప్రభుత్వానికి సుమారు రూ.2,300 కోట్ల అదనపు ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం లేకుండా వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆధునిక నివాసాలను అందించేలా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa