అరకు వెళ్లే పర్యాటకులకు శుభవార్త. అరకు - కొత్తవలస మార్గంలో అండర్పాస్ అందుబాటులోకి రానుంది. అరకు - కొత్తవలస మార్గంలో ఉన్న రైల్వే గేటు కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. రైల్వే గేట్ మూసివేసిన సమయంలో వాహనాలు బారులు తీరుతూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కార మార్గంగా అండర్పాస్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అండర్పాస్ నిర్మాణం పూర్తై, అందుబాటులోకి వచ్చిన తర్వాత రైల్వే గేటును పూర్తిగా మూసివేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రైల్వే గేటు వద్ద అండర్పాస్ వంతెన పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ వంతెనకు రహదారి మార్గాన్ని అనుసంధానం చేస్తున్నారు.ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో నుంచి ఈ రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణ పనులు పూర్తి చేసి.. రెండు వారాల్లో అండర్పాస్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చేలా అధికారులు కృషి చేస్తున్నారు.ఈ అండర్పాస్ వంతెన అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడుతుంది.
ఈ గ్రామాలకు రాకపోకలు బంద్
మరోవైపు అండర్పాస్ వద్ద రహదారి నిర్మాణ పనుల నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిరగాం, చొంపి, బస్కి పంచాయతీల పరిధిలో ఉండే గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఈ ఊర్లజనం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. పది కిలోమీటర్ల దూరం అధికంగా ప్రయాణం చేసి.. అరకులోయ నుంచి మాడగడ జంక్షన్ మీదుగా వారి ఊర్లకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా రహదారి నిర్మాణ పనులు పూర్తిచేయాలనే ఉద్దేశంతో అధికారులు ఉన్నారు. మరోవైపు అరకులోయను సందర్శించేందుకు పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో నిర్దేశిత సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు.
మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద రైల్వేశాఖ ఏపీలోని పలు రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేస్తోంది. నిధులు కేటాయించి అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే అల్లూరి జిల్లా అరకు లోయ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు. రైల్వేస్టేషన్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. జీప్లస్ టూ పద్ధతిలో కొత్త రైల్వేస్టేషన్ నిర్మిస్తున్నారు.
ఇందుకోసం కేంద్రం రూ.14 కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల సాయంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి. ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటుచేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఉండేలా రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని 73 ముఖ్యమైన రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa