ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 12, 2026, 06:53 AM

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో పీటీ వారెంట్ జారీ అయింది. గుంటూరు ప్రిన్సిపల్ సబ్ కోర్టులో సత్తెనపల్లి పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గతంలో సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. అంబటి నేతృత్వంలో లక్కీ డ్రా పేరుతో లాటరీ టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సచివాలయ వలంటీర్ల ద్వారా ఈ టికెట్ల అమ్మకాలు జరిగాయని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. 2023 సంక్రాంతి లక్కీ డ్రా లాటరీ టికెట్ల అమ్మకాలపై జనసేన నేతలు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అప్పట్లో కేసు నమోదు కాకపోవడంతో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు సబ్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు 2023 జనవరి 16న సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో అంబటి రాంబాబుపై కేసు నమోదు అయింది. తాజాగా అదే లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ అయింది. ఇదిలా ఉండగా, మూడు రోజుల క్రితమే అంబటి రాంబాబుకు సంబంధించిన మరో కేసులో కూడా పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఆందోళనలో అంబటి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని వెళ్లిన ఘటనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పీటీ వారెంట్‌లో పేర్కొన్నారు.ఈ కేసులో కోర్టు నిన్న ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందే సీఎం చంద్రబాబును దూషించిన కేసులో బెయిల్ మంజూరు అయింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో గురువారం జైలు నుంచి అంబటి బయటకు వస్తారని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ తరుణంలో మరో పిటి వారెంట్ జారీ కావడంతో ఈ కేసులో బెయిల్ మంజూరు అయ్యే వరకు జైలులో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa