ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సామాన్య భక్తులకు మొదట ప్రాధాన్యం.. అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 09:13 PM

మహాశివరాత్రిని పురస్కరించుకుని శైవక్షేత్రాలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. శివస్వాములు, భక్తులతో శ్రీశైలం క్యూలైన్లు నిండిపోతున్నాయి. రద్దీ అధికంగా ఉండటంతో క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సోమవారం కొంతమంది భక్తులు దేవస్థానం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పండుగను దృష్టిలో పెట్టుకుని శ్రీశైలంతో పాటుగా వివిధ శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ, వసతులు, ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.


మహాశివరాత్రి రోజున శ్రీశైలం సహా శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో అధికారులు మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, జిల్లా కలెక్టర్లు పరస్పరం సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లు, వసతులపై నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి త్వరితగతిన దర్శనం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వసతి సదుపాయాలు సకాలంలో లభించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. దీక్షలు, మాలలు ధరించి వచ్చే భక్తులను అగౌరవపరిచేలా, ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు.


భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు ప్రణాళికలు అధికారులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. భక్తులకు గౌరవ మర్యాదల విషయంలో, దర్శనం ఏర్పాట్ల విషయంలో రాజీలేదని అన్నారు. ఆలయ ఆచార వ్యవహారాల్లో అధికారులు జోక్యం చేసుకోవద్దని మంత్రి సూచించారు. ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, క్యూలైన్లలోని భక్తులకు పాలు, బిస్కెట్లు, మంచి నీరు వంటి సదుపాయాలు కల్పించాలని ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశించారు. ప్రసాదం పంపిణీ ఆలస్యం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. దర్శనాల సమయంలో వీఐపీలతో పాటుగా సామాన్య భక్తులకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆనం రామనారాయణ రెడ్డి.. వారికి కేటాయించిన సమయాల్లో దర్శన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa