ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాల్లో ఈసీ చేపట్టిన సవరణను స్వాగతిస్తున్నామని వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 09:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ  కార్యక్రమాన్ని వెంటనే చేపట్టాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని, ఇదే తరహాలో ఏపీలోనూ ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు స్పష్టం చేశారు.సోమవారం నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఆదివారం ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సమావేశంలో ప్రభుత్వం అన్ని పార్టీలను కోరింది. అయితే, ఇదే సమావేశంలో ప్రతిపక్షాలు ఓటర్ల జాబితా సవరణపై ఉన్న ఆందోళనలపై పార్లమెంటులో చర్చ జరగాలని పట్టుబట్టాయి.ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడుతూ.. ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ఆవశ్యకతను నొక్కిచెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో తాము పలు కీలక అంశాలను లేవనెత్తినట్లు తెలిపారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ అంశంపై ఈ సమావేశాల్లో సమగ్ర చర్చ జరగాలని కోరినట్టు వివరించారు. ఈ వివాదం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోందని, దీనికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.అలాగే, కేంద్ర ప్రభుత్వ పథకమైన జల్ జీవన్ మిషన్ గురించి కూడా ప్రస్తావించినట్లు శ్రీకృష్ణ దేవరాయలు తెలిపారు. ఈ పథకం అమలు విధానం, దాని ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు చేకూరే ప్రయోజనాలపై స్పష్టత కోసం పార్లమెంటులో చర్చ జరపాలని కోరినట్లు చెప్పారు. దీనివల్ల పథకం అమలులో పారదర్శకత వస్తుందని, రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు పూర్తిగా అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉండగా, ఓటర్ల జాబితాలో పేర్లను సరిచూసుకునేందుకు వీలుగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో SIR షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం మరో వారం పాటు పొడిగించింది. రాబోయే ఎన్నికల నాటికి ఓటర్ల జాబితాలను మరింత కచ్చితంగా, సమగ్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తాజా షెడ్యూల్ ప్రకారం, గణన ప్రక్రియను డిసెంబర్ 11 వరకు పొడిగించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను డిసెంబర్ 16న ప్రచురించి, 2026 జనవరి 15 వరకు అభ్యంతరాలు, చేర్పులకు అవకాశం కల్పిస్తారు. తదుపరి దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa