మహిళల వేషంలో కోర్టుకు వచ్చి కాల్పులు హరియాణాలో కలకలం

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 28, 2017, 01:32 PM
 

చండీగఢ్‌: హరియాణాలోని రోహ్‌తక్‌ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. జిల్లా కోర్టు ప్రాంగణంలో మహిళల వేషంలో వచ్చిన కొందరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఓ కేసు విచారణ నిమిత్తం గ్యాంగ్‌స్టర్‌ రమేశ్‌ లోహార్‌, అతడి అనుచరులను మంగళవారం ఉదయం పోలీసులు రోహ్‌తక్‌ జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. అయితే అప్పటికే కోర్టు ప్రాంగణంలో మహిళల వేషంలో ఉన్న ఐదుగురు దుండగులు రమేశ్‌పై కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిలో ఒకరు మృతిచెందారు. మరో ఇద్దరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.