ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్సాహం, ఆశాభావం, దేశహిత కాంక్షతో నూతన హేమలంబ(బి)వత్సరాన్ని స్వాగతిద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 28, 2017, 01:30 PM

భారతదేశంలో కాలగణనకు మూడు మానాలు అనూచానంగా వస్తున్నాయి. చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్య మానం. ఈ మూడూ వేదాధారమైన ప్రాచీన జ్యోతిషశాస్త్ర ప్రమాణాలతో ఉన్నవే. కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కాలమానాలు ప్రమాణాలు. సౌర-చాంద్ర మానాల్లో సంవత్సర నామాలు మారవు. చంద్రుడి నక్షత్ర యోగాన్ని అనుసరించి చాంద్రమానం, సూర్య సంక్రమణాల ప్రకారం సౌరమానం, గురూదయాన్ని ఆధారంగా చేసుకొని బార్హస్పత్య మానం లెక్కిస్తారు. ఎవరి పరంపరాగతమైన, ప్రాంతానుసార మానాలు వారికి ప్రమాణాలు. ఇందులో వైరుధ్యాలేమీ లేవు.లెక్కించే తీరుతెన్నుల్లో విభిన్నత్వం ఉన్నా- ఫలాల్లో, పంచాంగాల పద్ధతుల్లో పెద్దగా భేదమేదీ ఉండదు. ఈ సంవత్సరానికి ఉన్న పేర్లలో వేరువేరు వాదాలు ఉన్నాయి. వ్యవహారంలో అనేకమంది హేవళంబి, హేవిళంబి- అంటున్నారు. కొందరు హేమలంబ, హేమలంబి- అని వ్యవహరిస్తున్నారు. ఎవరి తీరు వారిదిగా నామం చెప్పవచ్చు. కానీ, ప్రాచీనమైన పలు గ్రంథాలు- జ్యోతిర్విదాభరణం, పంచాంగ పీఠికా లేఖన ప్రక్రియ, నిర్ణయ సింధు మొదలైనవి ‘హేమలంబ(బి)’ అని పేర్కొన్నాయి. దీన్ని ప్రమాణంగా భావించవచ్చు.ఈ ఏడాది దృక్‌ సిద్ధాంత రీత్యా పంచాంగ గణన చేసేవారు 28వ తేదీ (మంగళవారం) ఉగాదిగా నిర్ణయిస్తే, పూర్వ పద్ధతి ప్రకారం 29వ తేదీ (బుధవారం)గా స్వీకరించారు. పంచాంగ గణిత భేదంతో వచ్చిన చిన్న తేడా ఇది. ఎవరి పద్ధతి వారు అనుసరించి ఉగాది చేసుకోవచ్చు.రెండు ఉగాదులు చేసుకొనేవారూ కొందరు ఉండవచ్చు. ఇది పెద్ద వివాదాంశం కాదు.
ఉగాదినాడు నూతన సంవత్సర ఆరంభాన్ని చక్కని శుభ భావనతో, కాలరూపుడైన భగవంతుడి ఆరాధనతో పవిత్రంగా ఆచరించడం భారతీయుల సంప్రదాయం. శాస్త్ర విధిని అనుసరించి- ముందురోజే శుభ్రం చేసుకున్న గృహాన్ని మామిడి తోరణాలు, రంగవల్లులు, పసుపు గుమ్మాలతో అలంకరించడం సంప్రదాయం. బ్రాహ్మీ ముహూర్తంలో అభ్యంగన స్నానం చేసి గణపతిని, ఇష్టదేవతను పూజించాలి. వాణీ హిరణ్యగర్బు ´(సరస్వతి, బ్రహ్మ)లు, లక్ష్మీ నారాయణులు, ఉమా మహేశ్వరులతో పాటు దిక్పాలకులను, నవగ్రహాలను యథాశక్తి అర్చించాలి. పంచాంగాన్ని పూజించి, శాస్త్రవేత్త ద్వారా పంచాంగ శ్రవణం చేయాలి.తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు- అనే అయిదు అంగాలను జ్యోతిషశాస్త్ర రీత్యా గణించిన గ్రంథమే ‘పంచాంగం’. సంవత్సర ఆరంభంలో- గ్రహ, నక్షత్ర, వారాదులు అనుసరించి కాలాంశాల్ని తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. నిత్యం అనుష్ఠానం చేసుకొనేటప్పుడూ- దేశ, కాల సంకీర్తన అనే సంప్రదాయం ఉంది. ఆ సమయంలో మనం ఉన్న ప్రాంతం; అక్కడి నది, పర్వతాల ప్రస్తావన; దేశ సంకీర్తన; ఆనాటి తిథి, వార, నక్షత్రాది స్మరణ కాల సంకీర్తన ఉంటుంది. అనునిత్యం ఈ సంప్రదాయాన్ని పాటించడం వల్ల, ఆ రోజుకు సంబంధించిన కాలభాగాలు జ్ఞప్తిలో ఉంటాయి.
సంవత్సరం, పగలు, రాత్రి, పక్షం, మాసం, అయనం, యుగం, కల్పం... వీటన్నింటికీ పేర్లు, లక్షణాలు ఉన్నాయి. వీటి పరిజ్ఞానమే సంస్కృతి సంబంధ వారసత్వంగా భారతీయులందరి కర్తవ్యం. ఈ కర్తవ్య పాలనలో ఉగాది ఒక మధుర ఘట్టం. ఉ-గ- ‘ఉదు’ అంటే, నక్షత్రం. ‘గ’ అంటే, గమనం. నక్షత్ర గమన (చంద్రుడితో నక్షత్రానుబంధం) రీత్యా ఇది ఉగాది.పంచాంగ శ్రవణ అనంతరం- ఉగాది పచ్చడిని నివేదించి, ప్రసాదంగా స్వీకరించడం విధి. నింబ కుసుమం (వేప పూత), మామిడి, బెల్లం- దీని ప్రధాన ద్రవ్యాలు అని శాస్త్రం చెబుతోంది. ఈ ప్రసాదాన్ని మొదటి యామం (జాము)లోనే (ఉదయం 8.30-9.00 గంటల మధ్య) గ్రహించాలంటారు. కాలం ఎటువంటివాటిని సూచిం చినా సంకల్ప బలం, సత్కర్మ ఆచరణ, సద్భావనతో సవరించుకోగలం అనే చక్కటి విషయాన్ని పలు ధార్మిక, జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి.అందుకే ఉత్సాహం, ఆశాభావం, దేశహిత కాంక్షతో నూతన వత్సరాన్ని స్వాగతిద్దాం. కాల స్వరూపుడైన పరమేశ్వరుడు అందరికీ శుభాలు ప్రసాదించుగాక అని ప్రార్థిద్దాం!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com