ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైభవంగా శ్రీ కోదండరాముని బ్రహ్మోమత్సవాలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 26, 2017, 12:46 AM

  తిరుపతి, మేజర్‌న్యూస్‌ : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక  బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7.30 నుండి 8.00 గంటల మధ్య మేషలగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింప చేశారు. ఉదయం 8.00 నుండి 8.30 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు. అంతకుముందు ఉదయం 6.00 నుండి 7.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండ రామస్వామి వారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఎలా జరిగాయోనని స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. మేష లగ్నంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజాలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్ఠిస్తారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివౄఎద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా టిటిడి కార్యనిర్వహణాధికారి డాడి.సాంబశివరావు మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 6న, ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 10వ తేదీల్లో శ్రీ సీతారామ కళ్యాణాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. నగరవాసులు, పరిసర ప్రాంతప్రజలు పెద్ద ఎత్తున వాహనసేవల్లో పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోల భాస్కర్‌ మీడియాతో మాట్లాడుతూ మార్చి 29న ఉగాది, గరుడవాహనం, మార్చి 30న హనుమంతవాహనం, ఏప్రిల్‌ 1వ తేదీన రథోత్సవం, ఏప్రిల్‌ 2న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఏప్రిల్‌ 5 నుండి 7వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు, ఏప్రిల్‌ 8 నుండి 10వ తేదీ వరకు తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా స్థానికులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మహతి కళాక్షేత్రం, రామచంద్ర పుష్కరిణిలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటుచేసినట్టు వెల్లడించారు. అనంతరం ఉదయం 11.00 గంటల నుండి 12.00 గంటల వరకు శ్రీసీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. పెద్దశేష వాహనంపై కోదండరాముడి వైభవం : 


   బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్ర 8.00 నుండి 10.00 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీరామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేయనున్నారు. ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు స్వామివారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేసారు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమయ్యాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు.


ఆకట్టుకున్న అలంకరణలు : 


  ఆలయంలో అద్భుతంగా విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టారు. తితిదే గార్డెన్‌ విభాగం ఆధ్వర్యంలో రామాయణంలోని ఘట్టాలతో ఏర్పాటుచేసిన శ్రీరామ, లక్ష్మణ, భరత, శతౄఎఘ్నలను ఉయ్యాలలో పవళింపజేస్తున్న దశరధుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ, సీతామాత అపహరణ సమయమున రావణబహ్మ్రచే గాయపడిన జఠాయువుకు మోక్షమును ప్రసాదిస్తున్న శ్రీరామచంద్రుడు, మహిరావణుడు అనే రాక్షసుడిని సంహరించి శ్రీరామలక్ష్మణులను కాపాడి తీసుకొస్తున్న హనుమంతుడు సెట్‌లు, ఫ్లెక్సీ బోర్డులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయ్యంగార్‌, శ్రీశ్రీశ్రీ చిన్నజీయ్యంగార్‌, స్థానిక ఆలయాల ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి బి.మునిలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ పి.ఉమామహేశ్వర్‌రెడ్డి, కంకణభట్టార్‌ శ్రీ ఆనందకుమార్‌ దీక్షితులు, ఉపద్రష్ట శ్రీ పి.సీతారామాచార్యులు, ఆలయ అర్చకులు, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com