ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొల్లేటి సిగలో ప్రకృతి సోయగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2017, 01:06 AM

 -అభివృద్ధి చేస్తే ఆకట్టుకునే పర్యాటకం


 -దేశవిదేశాలకు చెందిన పక్షుల పలకరింపులు


 -150 జాతులపై పైగా పక్షుల నివాసం


 -జలమార్గం అభివృద్ధితో ప్రయోజనం


 -200 ఎకరాల్లో చెరువును తవ్వి పక్షుల


 -ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన


  అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : ప్రకృతి మనోహర దృశ్యం కొల్లేరు సరస్సు. అత్యంత సుందరమైన ఈ మంచినీటి సరస్సును దేశ విదేశా లకు చెందిన వేలాది పక్షులు పలకరిస్తాయి. కొల్లేరుకు మెరుగులు దిద్దితే ఇక ఆహ్లాదం పర్యాటకుల వంతే. కొల్లేరు సరస్సును ప్రముఖ పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అనుమతులను కేంద్రం నుంచి వచ్చేలా చూడాలి. రాష్ట్రంలో పక్షుల సంరక్షణ, జింకలు, ఎలుగుబంట్ల పార్కులను మరింత అభివృద్ధి పరిచి వాటిని ఆకర్షణీయ పర్యటక కేంద్రాలుగా రూపొం దించాలి. ఇటీవల వన్యప్రాణి సంరక్షణ బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశించారు. 


    కొల్లేరు సరస్సు రాష్ట్రంలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించి ఉంది. 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా పరిరక్షిస్తు న్నారు. రామ్‌సర్‌ కన్వెన్షన్‌ ప్రకారం దీన్ని అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న చిత్తడి నేలలుగా గుర్తించారు. పక్షులు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో పర్యటకులకు వసతు లు, బోటింగ్‌, విశ్రాంతి గదుల నిర్మాణం చేయాలని ప్రయత్నాలు జరిగాయి.


ఇవీ పర్యటక ప్రాంతాలు... 


   పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు గ్రామీణ మండలం గుడివాకలంక గ్రామంలో రూ. 6 కోట్లతో విడిది కేంద్రాలను నిర్మాణం చేశారు.  కృష్ణా జిల్లాలోని ఆటపాక, మణుగు లూరు లంక ప్రాంతాల్లో పక్షుల ఆవాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆటపాక వలస పక్షుల కేంద్రాన్ని గుర్తించి అభివృద్ధి చేశారు. 250 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది. ఇక్కడి పర్యవరణ విద్యాకేంద్రంలో కొల్లేరు సమాచారం, వీడియో ప్రొజెక్టర్‌ ద్వారా పక్షుల వివరాలు, నమూనాలు, ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన సమాచారం ఇక్కడ అందిస్తు న్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. సరస్సు నడిబోడ్డు లోని కొల్లేటికోట వద్ద పెద్దింట్లమ్మ ఆలయం ఉంది. వేల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయం లో అమ్మవారు విశాల నేత్రలతో పద్మాసనంలో దర్శన మిస్తుంది. కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా మాత్రమే కాక తక్కువ లోతునీటితో జనావాసంగా నివాసయోగ్యమైన ఈ ప్రాంతం కృష్ణా-గోదావరి నదులకు మధ్యగా ఉంది. దేశంలోనే అత్యంత సారవంతమైన 24 భూముల్లో కొల్లేరు చిత్తడినేలలు ఎంతో ముఖ్యమైనవి.


150 జాతులపై పైగా పక్షుల నివాసం...


కొల్లేరులో సుమారు 150 జాతుల వరకు పక్షులు నివసిస్తున్నాయి. 128 రకాలకు చెందిన చేపలు జీవిస్తున్నాయి. కొరమేను, మట్టగిడస, వాలుగ, వల్లింకాయ, నాటుగొరకా, ఇంగిలాయి, బొమ్మిడాయి లాంటి అరుదైన జాతి చేపలు ప్రత్యేకం. సహజ సిద్ధమైన సరస్సులో ఏడాది పొడవునా నీరు ఉండడంలేదు. వేసవి వచ్చిందంటే చాలు పూర్తిగా ఎండిపోతుండడంతో పక్షులు ఈ ప్రాంతాన్ని వదిలివెళ్లిపోతున్నాయి.


    పక్షులకు అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది. పర్యటకులు వస్తే ఒక్క కొల్లేరు ప్రాంతం మాత్రమే చూడటానికి అవకాశం ఉంటుంది. ఇతర ప్రాంతా లను అభివృద్ధి చేయాలి. సరస్సులోని వరద నీటిని సర్కారు కాలువ నుంచి ఉప్పుటేరు బంగాళాఖాతంలో కలుస్తుంది. వేసవిలో నీరు లేకపోవడం వల్ల ఉప్పుటేరు నుంచి సముద్రపు నీరు ఇందులోకి చొచ్చుకువస్తుంది. నీటిలో ఉప్పు సాంద్రత పెరగడం వల్ల పలు రకాల జలచరాలు, మత్స్యజాతులకు ప్రమాదం పొంచి ఉంటుంది. 


    గతంలో ఎగువ ప్రాంతాల నుంచి పలు నదులు, కాలువల ద్వారా వచ్చి చేరిన నీరు ఏడాది పొడవునా సరస్సులో ఉండేది. ఇప్పుడు కాలుష్య తీవ్రత పెరగడం కూడా ప్రమాదకరంగా మారింది. కొల్లేరు నుంచి ఉప్పుటేరు కలిసే ప్రాంతంలో రెగ్యులేటర్‌ నిర్మాణం చేసి నీటిని నిల్వ చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. 


జలమార్గం అభివృద్ధితో ప్రయోజనం...


   కొల్లేరులోని పలు ప్రాంతాలు, పెద్దింట్లమ్మ ఆలయం, ఏలూరు నగరాన్ని కలుపుతూ జలమార్గం అభివృద్ధి చేస్తే ప్రయోజనముంటుంది. కొల్లేరులోకి వచ్చే కాలుష్య కారకాలను ప్రభుత్వ అధికారులు అదుపు చేయాలి. రెగ్యులేటర్‌ నిర్మాణం, పర్యటకుల విడిది కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. కొల్లేరు ఆపరేషన్‌ తర్వాత ఈ ప్రాంతంలో పర్యటకంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించినప్పటికీ ఒక్క అడుగు ముందుకు వేయలేదు. రెగ్యులేటర్‌ను నిర్మించి ఐదడుగుల నీటిని స్థిరీకరించాలని స్థానికులు కోరుతున్నారు. రహదారులు వేసి, పర్యటకులు ఇక్కడే నివసించేందుకు వీలుగా రిసార్టులు, రెస్టారెంట్‌లు నిర్మించాల్సిన అవసరం ఉంది.


     కైకలూరు ఆటపాక వద్ద ఉన్న పక్షుల కేంద్రం మాదిరీగా మండవల్లి మండలం మణుగులూరులో 200 ఎకరాల్లో చెరువును తవ్వి పక్షుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉంది. కొల్లేరులో ఉప్పుటేరు వద్ద రెగ్యులేటర్‌ నిర్మాణం చేసి ఐదడుగుల నీటిని స్థిరికరించాలని బీఎంఎస్‌ మత్స్యశాఖ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వరరావు తెలిపారు.  దీనివల్ల పక్షులకు వేసవికాలంలో ఆహారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఎన్నో అవకాశా లున్నా కొల్లేరు ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉండడంతోనే పర్యాటకంలో అవకా శాలు తగ్గుతున్నాయని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com