బీజింగ్: అమెరికాపై డ్రాగన్ కంట్రీ చైనా మరోమారు విరుచుకుపడింది. తైవాన్‌కు అత్యాధునిక ఆయుధాలు విక్రయించాలన్న నిర్ణయంపై నిప్పులు చెరిగింది. ‘‘తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని చైనా తేల్చిచెప్పింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ పేర్కొన్నారు. అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన ఈ విషయాన్ని అమెరికా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. సైనో-యూఎస్ సంబంధాలు దెబ్బతినకుండా ఉండాలన్నా, తైవాన్‌లో శాంతి, సుస్థిరత విలసిల్లాలన్నా ‘వన్ చైనా విధానానికి వాషింగ్టన్ కట్టుబడి ఉండాలని, తైవాన్‌కు ఆయుధాల విక్రయాన్ని నిలిపివేయాలని కోరింది. తైవాన్‌కు పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలు విక్రయించేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధమవుతుందన్న యూఎస్ మీడియా వార్తల నేపథ్యంలో హువా చున్యింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.