ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాట‌మ‌రాయుడు సినిమా రివ్యూ: ప‌వ‌న్ అభిమానుల‌కు కాట‌మ‌రాయుడు ప‌సందైన విందు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 11:57 AM

చిత్రం: కాటమరాయుడు రేటింగ్ 4 .25 / 5 
నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, నాజర్‌, అలీ, రావు రమేష్‌, ప్రదీప్‌ రావత్‌, తరుణ్‌ అరోరా, శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల
నిర్మాత: శరత్‌ మరార్‌
దర్శకత్వం: డాలీ
తెలుగు సినిమా బాక్సాఫీసుకి కొత్త ఒరవడి తీసుకొచ్చిన కథానాయకుల్లో పవన్‌ కల్యాణ్‌ ఒకరు. అందుకే ఆయన్నుంచి సినిమా అనగానే అభిమానుల్లో ఓరకమైన అంచనాలు ఏర్పడిపోతాయి. అభిమానులు, మార్కెట్‌ వర్గాలు గంపెడాశలతో ఎదురుచూస్తుంటారు. విడుదలకు ముందే... రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగిపోతుంటుంది. అయితే ‘సర్దార్‌-గబ్బర్‌సింగ్‌’తో పవన్‌ ఆయన అభిమానుల్నే కాదు, ట్రేడ్‌ వర్గాల్నీ నిరుత్సాహపరిచారు. దీంతో ఈసారి కచ్చితంగా విజయం సాధించి, అభిమానుల్ని సంతృప్తిపరచాల్సిన అవసరం ఏర్పడింది. తమిళనాట విజయం సాధించిన ‘వీరమ్‌’ కథలో తనకు కావల్సిన అన్ని అంశాలూ ఉన్నాయని గ్రహించారు పవన్‌. అందుకే ఈ సినిమాని రీమేక్‌ చేసే బాధ్యత దర్శకుడు డాలీకి అప్పగించారు. ఇది వరకు డాలీ నుంచి వచ్చిన రీమేక్‌ చిత్రాలు ‘గోపాల గోపాల’, ‘తడాఖా’ మంచి విజయాల్ని అందుకొన్నాయి. ఈసారీ ఆయన రీమేక్‌ కథకి న్యాయం చేస్తారన్న అంచనాలు ఏర్పడ్డాయి. మరి పవన్‌ నమ్మకం నిజమైందా? డాలీ తన బాధ్యతను ఎంత వరకూ నెరవేర్చారు? ఈ విషయాలు తెలియాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే.
కాటమరాయుడు(పవన్‌ కల్యాణ్‌)కి నలుగురు తమ్ముళ్లు (శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు). వాళ్లంటే రాయుడికి ప్రాణం. వూరికి పెద్దగా.. పేదోళ్ల పాలిట దేవుడిగా రాయుడ్ని కొలుస్తుంటారు గ్రామస్థులు.  వాళ్ల‌కి ఏ ఆప‌ద వ‌చ్చినా రాయుడు అండగా నిలబడతాడు. ఇంత మంచి రాయుడికి ఓ బలహీనత కూడా ఉంది. తనకు అమ్మాయిలంటే పడదు. అందుకే పెళ్లీడు వచ్చి దాటిపోతున్నా... పెళ్లి మాటెత్తడు. అన్నయ్యకు పెళ్లికాకపోతే తమ్ముళ్లకెందుకు అవుతుంది? వాళ్లకు అమ్మాయిలు, పెళ్లి, సంసారం లాంటి కలలున్నా... అన్నయ్య కోసం తమ కోరికల్ని, ఆశల్ని చంపేసుకొంటారు. ఇలాంటి కాటమరాయుడి జీవితంలోకి అవంతిక (శ్రుతిహాసన్‌) ప్రవేశిస్తుంది. అవంతిక ఎవరు? ఆమె వల్ల రాయుడి జీవితంలోకి ఎలాంటి అనూహ్యమైన మార్పులొచ్చాయి? తమ్ముళ్ల ప్రేమకథలు ఎలా మొదలయ్యాయి? అనేదే ‘కాటమరాయుడు’ కథ.
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వీరమ్‌’కి రీమేక్‌ ఇది. దర్శకుడు వీరమ్‌ కథని దాదాపు ఫాలో అయిపోయాడు. కొత్త మలుపులు, కొత్త క్యారెక్టరైజేషన్‌ల జోలికి వెళ్లలేదు. కాకపోతే పవన్‌కల్యాణ్‌ పాత్రపై ప్రత్యేక దృష్టి నిలిపాడు. ఆయన్ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించాడు. సినిమా ప్రారంభం.. నడవడిక పవన్‌ కల్యాణ్‌ను పరిచయం చేసిన పద్ధతి ఇవన్నీ అభిమానులను అలరిస్తాయి. ముఖ్యంగా పవన్‌, శ్రుతిహాసన్‌ల మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నిజానికి లవ్‌ ట్రాక్‌పై వీరమ్‌  దర్శకుడు శివ పెద్దగా దృష్టి పెట్టలేదు. కానీ డాలీ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. అందుకే పవన్‌ గత చిత్రాల కన్నా ఎక్కువ రొమాంటిక్‌గా కనిపిస్తాడు. పవన్‌ నుంచి ఆశించే వినోదం ప్రతి సన్నివేశంలో ఉండేలా జాగ్రత్త పడుతూ కథని నడిపించాడు. తమ్ముళ్లతో అన్నదమ్ముల సన్నివేశాలు, అన్నయ్యను ప్రేమలోకి దింపేందుకు వారు చేసే యత్నాలు.. మధ్య మధ్యలో యాక్షన్‌ ఎపిసోడ్స్‌.. వీటితో ప్రథమార్ధం సాఫీగా సాగిపోతుంది. హీరోయిజం, ఎమోషన్స్‌ సమపాళ్లలో మేళవించిన కథ ఇది. దాంతో ద్వితీయార్థం కాస్త నిదానంగా సాగుతుంది. కథని ముందుకు నడిపించే శక్తి సన్నివేశాలకు లేకపోవడంతో ఆ బాధ్యతను కూడా పవన్‌కల్యాణే తన భుజస్కందాలపై మోశాడు. ద్వితీయార్థం చివర్లో దర్శకుడు మళ్లీ ట్రాక్‌ ఎక్కడంతో ఎమోషన్స్‌ క్యారీ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య బలమైన భావోద్వేగ స‌న్నివేశాలు చూపించగలగడంతో పతాక సన్నివేశాలకు న్యాయం జరిగింది.  సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌తో నిరాశపడిన అభిమానులను పవన్‌కళ్యాణ్‌ ఈ సినిమా ద్వారా ఆ లోటు తీర్చే ప్రయత్నం చేశారు.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పవన్‌కల్యాణ్‌ కోసం.. ఆయన అభిమానుల కోసం తీసిన సినిమా. పవన్‌ తన అభిమానులను అలరించేందుకు శాయశక్తులా కృషి చేశాడు. పవన్‌ బలం వినోదం పంచడం. అది ఏ సన్నివేశంలోనూ లోటుకాకుండా దర్శకుడు జాగ్రత్తలు తీసుకోవడంతో ఈ సినిమా వన్‌మాన్‌షోగా నిలిచిపోయింది. అత్తారింటికి దారేది తర్వాత పవన్‌కల్యాణ్‌లోని చలాకీదనం ఈ సినిమాలోనే కనిపించింది. కాకపోతే పాటల్లో డ్యాన్స్‌ల విషయంలో పవన్‌ మరింత దృష్టి పెడితే బాగుండేది. శ్రుతిహాసన్‌ అందంగా కనిపించింది. పాత్ర పరిధి మేరకు రాణించింది. తమ్ముళ్లు నలుగురు ఉన్నా... అజయ్‌, శివబాలాజీల పాత్రలకు మాత్రమే ప్రాధాన్యం కన్పించింది. రావురమేష్‌ పాత్ర‌ ఆకట్టుకుంది. రాయలసీమ మాండలికంలో సాగే సంభాషణలు అల‌రిస్తాయి.  తరుణ్‌ అరోరా పాత్ర గంభీరంగా సాగినప్పటికీ పూర్తిస్థాయిలో తీర్చిదిద్దలేదు. అలీ, నాజర్‌, పృథ్వీ వీళ్లంతా ఓకే అనిపిస్తారు. యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో వినిపించే నేపథ్య సంగీతం ప్రత్యేకంగా అన్పిస్తుంది. ప్రసాద్‌ మూరెళ్ల తన కెమెరాతో సినిమాకు వన్నె తెచ్చాడు. ఆయన ఎంచుకున్న కలర్‌ కాంబినేషన్స్‌, పల్లెటూరి అందాలను చూపించిన తీరు అలరిస్తుంది. వీర‌మ్ క‌థ‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇమేజ్‌ను జోడించి అభిమానుల‌ను ఆక‌ట్టుకునేలా తీర్చిదిద్ద‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు.


బలాలు
పవన్‌కల్యాణ్‌ 


లవ్‌ట్రాక్‌
అన్నదమ్ముల అనుబంధం
బలహీనతలు
 పాటలు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com