ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిఎం అవుతానని ఆదిత్యనాథ్‌కు ముందే తెలుసా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 01:24 AM

 -పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి ఆశ్చర్యపరిచిన యూపీ సీఎం 


 -వేధింపుల బాధితుడి ట్వీట్‌ వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి


 -యూపీ పోలీస్‌ శాఖ ప్రక్షాళన: 100 మంది పోలీసులపై వేటు


 -చీపురు పట్టిన యూపీ మంత్రి 


లక్నో: యూపీలో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కబేళాలను మూయించేస్తానని యోగి ఆదిత్యనాథ్‌ నాడే చెప్పారు. యోగి ఆదిత్యనాథ్‌ సీఎం కాక ముందు చల్తే చల్తే అనే ఓ టీవీ కార్యక్రమంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అన్ని కబేళాలను మూయించేస్తామని, పోలీసులతో యాంటీ రోమియో దళాలును ఏర్పాటు చేస్తామని నాటి ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. యూపీలో బీజేపీ భారీ విజయం సాధించడం, యోగి ఆదిత్య నాథ్‌ సీఎం కావడంతో నాడు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే తాను సీఎంను అవుతాననే విషయం ఆదిత్యనాథ్‌ కు ముందే తెలుసని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. యూపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, పాలనలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళుతున్న యోగి ఆదిత్యనాథ్‌, లక్నోలో నిత్యమూ బిజీగా ఉండే హజ్రత్‌ గంజ్‌ పోలీసులను ఆశ్చర్యపరుస్తూ, ఎవరికీ చెప్పాపెట్టకుండా గురువారం ఉదయం తనిఖీకి వెళ్లారు. అక్కడి రికార్డులు, నేరస్తులను ఉంచే గదులు, వాటిల్లోని సౌకర్యాలను ఆయన పరిశీలించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న నేరాలను గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం ఆకస్మిక తనిఖీతో పోలీసు వర్గాల్లో ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళన కూడా కలిగినట్టు సమాచారం. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేస్తామని, అసాంఘిక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఇప్పటికే స్పష్టం చేసిన ఆయన, మహిళల భద్రత కోసం యాంటీ రోమియో స్క్వాడ్స్‌ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టి పాలనలో తనదైన ముద్ర వేస్తూ, దూసుకుపోతున్న యోగి ఆదిత్యనాథ్‌, తన ట్విట్టర్‌ ఖాతాకు వచ్చిన సమస్యపై వెంటనే స్పందించారు. ఓ వేధింపుల కేసులో పోలీసులు సత్వర చర్యలు తీసుకోవడం లేదని బాధితురాలి కుటుంబ సభ్యుడు డీజీపీ, సీఎం ఆఫీసును ట్యాగ్‌ చేస్తూ, ట్వీట్‌ పెట్టగా ఆదిత్యనాథ్‌ స్పందించారు. ఈ ఘటన హోలీ పర్వదినం నాడు కాన్పూర్‌ లో జరిగింది. కొందరు స్థానికులు ఓ ఇంట్లోకి జొరబడి ఓ మహిళను, ఆమె కుమార్తెను వేధించారు. అడ్డొచ్చిన ఆమె భర్తపై దాడికి దిగారు.  ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని, తన ట్వీట్‌ లో ఆయన ఫిర్యాదు చేశారు. ఆపై సీఎం కల్పించుకున్నాక కేసులో కదలిక వచ్చింది. లక్నోలోని డీజీపీ ఆఫీసు నుంచి నాకు కాల్‌ వచ్చింది. ఈ కేసులో సరైన చర్యలు తీసుకోవాలని, నివేదిక సమర్పించాలని నన్ను ఆదేశించారు. ఆ వెంటనే నేను స్వయంగా వెళ్లి ఆ కుటుంబాన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను. బాధితులకు వైద్య పరీక్షల నిమిత్తం ఏర్పాట్లు చేయించాను అని కాన్పూర్‌ పశ్చిమ ఎస్పీ సచ్చీంద్ర పటేల్‌ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో పెరిగిపోతున్న నేరాలను అరికడతామని ఎన్నికల ప్రచార సభల్లో చెప్పుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అదే పనిలో పడింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యోగి ఆదిత్యనాథ్‌ ముందుగా అవినీతికి పాల్పడుతున్న పోలీసుల గుండె ల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 100 మంది పోలీసులను సస్పెండ్‌ చేశారు. ముఖ్యంగా ఘజియాబాద్‌, మీరట్‌, నోయిడా ప్రాంతాల్లోని పోలీసులపై ఈ వేటు వేశారు. లక్నోలో సస్పెండ్‌ అయిన వారిలో ఏడుగురు ఇన్‌స్పెక్టర్లు కూడా ఉన్నారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసులను సస్పెండ్‌ చేయాలని తమకు డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయని, అందుకే సస్పెండ్‌ చేశామని యూపీ పోలీస్‌ పీఆర్వో రాహుల్‌ శ్రీవాత్సవ మీడియాకు చెప్పారు. సెస్పెండ్‌ అయిన వారిలో అధికమంది కానిస్టేబుల్‌ స్థాయిలోని వారేనని పేర్కొన్నారు. యూపీ కేబినెట్‌ మంత్రి ఉపేంద్ర తివారీ తన కార్యాలయాన్ని, పరిసరాలను ఆయనే స్వయంగా శుభ్రం చేశారు. గురువారం ఆయన తన కార్యాలయానికి వెళ్తుండగా పరిసరాలు చెత్తతో నిండి ఉండటాన్ని గమనించారు. సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, స్వయంగా చీపురు తీసుకుని తన కార్యాలయాన్ని, కారిడార్‌ ను శుభ్రం చేయడంతో అక్కడ ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారు. కాగా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన కేబినెట్‌ మంత్రులను కార్యాలయాలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. పరిశుభ్రత నిమిత్తం ఏడాదిలో వంద గంటలు కేటాయించాలని కేబినెట్‌ మంత్రులతో ఇటీవల ప్రతిజ్ఞ చేయించారు. ఈ నేపథ్యంలో ఉపేంద్ర తివారీ స్వయంగా చీపురు పట్టుకున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com