ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాట‌మ‌రాయుడు సినిమా రివ్యూ: ప‌వ‌న్ అభిమానుల‌కు కాట‌మ‌రాయుడు ప‌సందైన విందు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2017, 01:48 PM

చిత్రం: కాటమరాయుడు రేటింగ్ 4 .0 / 5 


నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, నాజర్‌, అలీ, రావు రమేష్‌, ప్రదీప్‌ రావత్‌, తరుణ్‌ అరోరా, శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు తదితరులు 
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
కూర్పు: గౌతంరాజు
ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల 
నిర్మాత: శరత్‌ మరార్‌ 
దర్శకత్వం: డాలీ
రంభం నుండే భారీ అంచనాల్ని మూటగట్టుకుని ప్రతి దశలోనూ పాటలు, టీజర్, ట్రైలర్లతో అభిమానుల్ని అలరిస్తూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం ‘కాటమరాయుడు’ ఈరోజే భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ సరసన శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు డాలి డైరెక్ట్ చేశారు. మరి ఈ చిత్రం అశేషాభిమానుల ఆశలను ఎంతవరకు నిలబెడుతుందో ఇప్పుడు పరిశీలిద్దాం..
రాయలసీమలోని ఒక ఊరికి పెద్ద కాటమరాయుడు (పవన్ కళ్యాణ్). ఆ ఊరిలో పేదలను పీడించే ధనవంతులకు ఎదురు నిలుస్తూ పేదల బాగు కోసం పనిచేస్తుంటాడు. అలాగే ఆయనకు తన నలుగురు తమ్ముళ్లన్నా ప్రాణం. పెళ్లి చేసుకుంటే తమ మధ్య గొడవలొస్తాయనే భయంతో అతను పెళ్లి కూడా చేసుకోకుండా ఆడవాళ్లకు దూరంగా ఉంటాడు. కానీ అతని నలుగురు తమ్ముళ్లు మాత్రం ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. దానికి ముందుగా అన్నయ్య పెళ్లి జరగాలని నిశ్చయించుకుని ఆయన్ను అదే ఊరికి పని మీద వచ్చిన అవంతిక (శ్రుతిహాసన్) తో ప్రేమలో పడేలా చేస్తారు.అలా అంతా సరదాగా సాగిపోతున్న సమయంలో కాటమరాయుడు, అవంతికల మీద అటాక్ జరుగుతుంది. దాంతో పాటే అవంతిక కుటుంబం పెద్ద ఆపదలో ఉందని కూడా రాయుడికి తెలుస్తుంది. అసలు రాయుడు, శృతిల మీద అటాక్ చేసింది ఎవరు ? అవంతిక కుటుంబానికి పొంచి ఉన్న ఆపద ఏమిటి ? ఆ ఆపద నుండి రాయుడు తన వాళ్ళను ఎలా కాపాడుకుంటాడు ? అనేదే ఈ సినిమా కథ.


సినిమాలోని మొదటి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది అనుమానం లేకుండా పవన్ కళ్యాణే. పవన్ తన చరీష్మతో అభిమానుల్ని ఉర్రూతలూపాడు. అచ్చమైన చేనేత పంచెకట్టులో, మిరా మిరా కోర మీసంతో పవన్ స్క్రీన్ మీద కొత్తగా కనిపిస్తున్నంతసేపు ఫ్యాన్స్ కు పండుగనే చెప్పాలి. పవన్ ఫైట్స్ లో, పంచ్ డైలాగుల్లో, డ్యాన్సుల్లో అభిమానులకు, ప్రేక్షకులకు ఎంజాయ్ చేసేందుకు కావాల్సినంత కంటెంట్ దొరికింది.ఇక శృతి హాసన్ తో నడిచే రొమాంటిక్ సన్నివేశాల్లో పవన్ తన ట్రేడ్ మార్క్ పెర్ఫార్మెన్స్ చూపించి థియేటర్ మారుమోగిపోయేలా చేశాడు. ఫస్టాఫ్లో తమ్ముళ్లు రాయుడిని ప్రేమలోకి దించే ట్రాక్లో అలీ జనరేట్ చేసిన బోలెడంత కామెడీ బాగా నవ్వించింది. ఇది రీమేక్ చిత్రమే అయినప్పటికీ దర్శకుడు డాలి ఒరిజినల్ వెర్షన్లోని కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే తీసుకుని వాటిని కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చుకుని సినిమాను చాలా వరకు ప్రేక్షకులకు నచ్చే విధంగా నడిపాడు.ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా పవన్ పాత్రను ఎలివేట్ చేసే సన్నివేశాలతో, ఫ్రెష్ కామెడీతో, రొమాన్స్ తో నిండి సరదాగా సాగిపోయింది. సెకండాఫ్ లో ఆరంభంలో కూడా అభిమానుల్ని మెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని ఎమోషనల్, కామెడీ సన్నివేశాలు ఉన్నాయి. పవన్ తమ్ముళ్లుగా శివ బాలాజీ, కమల్ కామరాజ్, కృష్ణ చైతన్యలు పర్వాలేదనిపించినా అజయ్ మాత్రం చాలా రోజులపాటు గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ చూపించాడు. హీరోయిన్ శృతి హాసన్ గ్లామరస్ గా కన్పిస్తూనే మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచింది. ప్రతి నాయకుల్లో ఒకడిగా నటించిన రావు రమేష్ పాత్ర చాలా వైవిధ్యంగా, ఆసక్తికరంగా ఉంది.
సినిమాలోని మైనస్ పాయింట్స్ అంటే అది సెకండాఫ్ అనే చెప్పాలి. ఆరంభం బాగానే ఉన్నా కూడా పోను పోను సినిమాలో ఎంటర్టైన్మెంట్ తగ్గి రొటీన్ గా మారిపోయింది. చాలా సినిమాల్లో చూసినట్టు ఒకటే రొటీన్ కథనం. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఊహించవచ్చు. ఒక పాట, ఆ తర్వాత ఒక ఫైట్ అన్నట్టు సాగే ఆఖరి 40 నిముషాల సినిమా అప్పటి వరకు పొందిన ఉత్సాహాన్ని కాస్త దెబ్బతీసింది. ఇక క్లైమాక్స్ కూడా కొత్తగా ఏమీ లేదు. దర్శకుడు డాలి ఇక్కడ పాత ఫార్ములానే ఉపయోగించాడు. పైగా ఈ ఎపిసోడ్ టేకింగ్ అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు.. అంటే పవన్ ఇమేజ్ కు తగ్గ స్థాయిలో లేదు.ఫస్టాఫ్ వరకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అనూప్ రూబెన్స్ సెకండాఫ్ కు వచ్చేసరికి చల్లబడిపోయాడు. అలాగే రావు రమేష్ పాత్ర ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది అనుకునేలోపు దాన్ని కాస్త ఫన్నీగా ముగించడం అంత సంతృప్తికరంగా లేదు. అలాగే ప్రధాన విలన్ పాటర్ కూడామధ్యస్థంగానే ఉండి పవన్ ముందు తేలిపోయింది. ఈ ప్రతికూల అంశాలన్నీ కలిసి సెకండాఫ్ ను సాధారణంగానే మిగిల్చాయి. అలా కాకుండా సెకండాఫ్ కాస్త కొత్తగా మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఇంకొంచెం బలంగా ఉండి ఉంటే సినిమా ఫలితం వేరే స్థాయిలో ఉండేది.
ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రాయలసీమ పల్లెటూరి వాతావరణాన్ని ఆయన చాలా రియలిస్టిక్ గా, అందంగా చూపించారు. తమిళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు తయారు చేయడంలో రచయిత ఆకుల శివ, దానికి ఫస్టాఫ్ వరకు మంచి ఆకట్టుకునే కథనాన్ని ఇవ్వడంలో వాసు వర్మ, దీపక్ రాజ్ లు, ఆ మొత్తాన్ని తెరకెక్కించడంలో దర్శకుడు డాలి చాలా వరకు సక్సెస్ అయ్యారు. అయితే టీమ్ సెకండాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది.అనూప్ రూబెన్స్ అందించిన పాటలను విజువల్ గా చూస్తే చాలా బాగున్నాయి. కానీ సెకండాఫ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చివరి పాట మాత్రం చాలా సాదా సీదాగా ఉన్నాయి. రామ్ – లక్ష్మణ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ లో ఒక్క క్లైమాక్స్ ఫైట్ తప్ప మిగిలినవన్నీ పవన్ స్థాయి తగ్గట్టు ఉండి మాస్ ప్రేక్షలకు బాగా ఎక్కుతాయి. గౌతమ్ రాజు ఎడిటింగ్ బాగుంది. శరత్ మరార్ ఎప్పటిలాగే చిత్ర నిర్మాణంలో మంచి విలువలను పాటించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఎనర్జిటిక్ గా, ఎంజాయ్ చేస్తూ చేసిన ఈ ‘కాటమరాయుడు’ చిత్రంతో ఆయన మరోసారి అభిమానులు మెచ్చే కథానాయకుడని అనిపించుకున్నారు. పవన్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, అన్ని కోణాల్లోనూ బాగున్న ఫస్టాఫ్, కాస్త ఎమోషనల్ గా కనెక్టయ్యే ఫ్యామిలీ డ్రామా, శృతి గ్లామరస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు కాగా మొదలైన కాసేపటి తర్వాత రొటీన్ గా సాగే సెకండాఫ్, ఏమాత్రం కొత్తదనం లేని ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్, 2వ అర్ధభాగంలో చప్పగా సాగిన అనూప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతికూలతలుగా ఉన్నాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ వేసవికి మొదటి విజేతగా నిలిచే ‘కాటమరాయుడు’ అభిమానులకు పండుగను, మిగిలిన ప్రేక్షకులకు మంచి సినిమాను చూసిన అనుభవాన్ని ఇస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com