రెహమాన్‌తో ప్రతి సినిమా ప్రత్యేక ప్రయాణమే

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 05:09 PM
 

చెన్నై: సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌తో ప్రతి సినిమా ప్రత్యేక ప్రయాణమని ప్రముఖ దర్శకుడు మణిరత్నం అన్నారు. కార్తీ హీరోగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కాట్రు వెలియిదై’ (తెలుగులో ‘చెలియా’) పాటలను సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతోపాటు హీరో సూర్య కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెహమాన్‌తో తనకున్న అనుబంధం గురించి మణిశర్మ మాట్లాడుతూ.. తామిద్దరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టి 25 ఏళ్లు అయ్యిందని, కానీ నిన్నే రెహమాన్‌ను కలిసిన భావన కలుగుతోందని పేర్కొన్నారు. రెహమాన్‌తో చేసిన ప్రతి సినిమా ప్రత్యేక ప్రయాణమని, ఆయన తన ఒక్కో ప్రాజెక్టుకు విభిన్న సంగీతాన్ని అందించి కొత్తదనాన్ని తీసుకొచ్చారని తెలిపారు. రెహమాన్‌, గీత రచయిత వైరముత్తుతో కలిసి పనిచేయడం ఆనందంగా భావిస్తున్నానని మణిరత్నం అన్నారు. ఈ ముగ్గురి ప్రయాణం 1992లో రొమాంటిక్‌ డ్రామా ‘రోజా’తో మొదలైంది.మణిరత్నం వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని, బాలచందర్‌ తనను మణిరత్నంకు పరిచయం చేయకపోయుంటే ఇది సాధ్యమయ్యేది కాదనిరెహమాన్‌ అన్నారు. అదితిరావు హైదరి కథానాయికగా నటించిన ‘చెలియా’ చిత్రం ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.