యూపీలో బీఎస్పీ నేత దారుణ హత్య

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 04:49 PM
 

దిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ హత్య కలకలం రేపింది. అలహాబాద్‌లో బహుజన్‌ సమాజ్‌ పార్టీకి చెందిన నేతను కొందరు దుండగులు కాల్చి చంపారు. మహమ్మద్‌ సమి(55) అనే బీఎస్పీ నేత ఇంట్లో ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తుపాకీతో కాల్చి పరారయ్యారు. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. రాజకీయ కక్ష్యలతోనే ఈ హత్యే జరిగి ఉంటుందని.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో ఈ హత్యకు ఎలాంటి సంబంధం ఉండి ఉండదని పోలీసులు భావిస్తున్నారు. కుట్ర పన్ని సమిని హత్య చేశారని ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానిక భాజపా నేతలపై వారు ఫిర్యాదు చేశారు.


సమి గతేడాది పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సమాజ్‌వాదీ పార్టీని వీడి బీఎస్పీలో చేరారు. 2002లో సమాజ్‌వాదీ పార్టీ టిక్కెట్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. అప్పుడు వివాదాస్పద స్వతంత్ర ఎమ్మెల్యే రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ అలియాస్‌ రాజా భయ్యాపై పోటీ చేశారు. రఘురాజ్‌ ప్రతాప్‌ సింగ్‌ గతంలో అఖిలేశ్‌ యాదవ్‌ ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. సమి హత్యతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రోడ్డుపై ఆందోళన చేపట్టిన సమి మద్దతుదారులను చెదరగొట్టారు. దుండగుల కోసం గాలిస్తున్నామని.. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ శలభ్‌ మాధూర్‌ తెలిపారు.