ప్రశాంత్ కిషోర్ ను పట్టిస్తే ఐదు లక్షలిస్తాం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 04:19 PM
 

ప్రశాంత్ కిషోర్.. ఈయనను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిస్టుగా బాగా ఫేమస్. ఆ తర్వాత బీజేపీ ఈయనను పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కొని తెచ్చుకుంది. యూపీ ఎన్నికలకు ఏడాది ముందు నుంచినే ప్రశాంత్ కాంగ్రెస్ తరపున రంగంలోకి దిగాడు. రాహుల్ ను , కాంగ్రెస్ ను ప్రొజెక్ట్ చేస్తూ పలు వ్యూహాలను రచించాడు. వాటిని అమలు పెట్టడానికి ప్రయత్నించాడు.

బ్రహ్మణ కులానికి చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థి, కాట్ పే చర్చ.. వంటి వ్యహాలతో ప్రశాంత్ కాంగ్రెస్ తరపున పని చేశాడు. అయితే.. అవేవీ కూడా కాంగ్రెస్ ను రక్షించలేకపోయాయి. యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కలిసి బరిలోకి దిగి.. అత్యంత దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఈ ఓటమిని మరిచిపోవడానికే వెళ్లాడో, లేక తల్లి కోసం వెళ్లాడో.. రాహుల్ విదేశం వెళ్లిపోయాడు.
 


అయితే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం రగిలిపోతున్నారు. యూపీలో ఓటమితో వారు మండిపోతున్నారు. మరి ఈ ఆగ్రహాన్ని ఎవరిపై ప్రదర్శించాలో తెలియక.. వారు ప్రశాంత్ కిషోర్ పై పడ్డారు. తమ పార్టీ ఓటమికి కారణం ప్రశాంతే అని వారు వాపోతున్నారు. అంతేకాదు.. యూపీలోని కొన్ని జిల్లాల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు.. కొన్ని పోస్టర్లను అతికించారు.

‘ప్రశాంత్ కిషోర్ ను మాకు పట్టివ్వండి.. మీకు ఐదు లక్షల రివార్డు ఇస్తాం...’ అనేది కాంగ్రెస్ ఆఫీసుల బయట అతికించబడ్డ పోస్టర్ల సారాంశం. ఎన్నికల ఫలితాల రోజునుంచి ప్రశాంత్ కనిపించడం లేదని, అతడు దొరికితే పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తల ముందు నిలబెడతామని ఆ పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వం అంటోంది. అయితే.. యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ మాత్రం ఆ పోస్టర్లను తక్షణం తొలగించాలని ఆదేశాలు జారీ చేశాడట.