విశ్వాసం చాటుకొని యజమానులను కాపాడి ప్రాణాలొదిలిన శునకం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 12:05 PM
 

కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో శునకం  ఓ నాగుపాముతో చేసిన పోరాటం వార్త నేడు అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. తన యజమానులను రక్షించుకునేందుకు ఏకంగా నాగుపాముతో పోరాడింది. చివరకు పాముకాటుకు గురై ప్రాణాలు వదిలింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళం జిల్లాలో వెలుగు చూసింది. ప్రభుత్వ మాజీ అధికారులైన గంగాధరన్ దంపతులు నెలరోజుల వయసున్న ఓ కుక్కపిల్లను తీసుకువచ్చి దానికి మౌళి అని పేరు పెట్టి పెంచుకుంటున్నారు. గంగాధరన్ దంపతులు ఇంట్లో ఉండగా ఐదు అడుగుల పొడవున్న పెద్ద నాగుపాము ఇంట్లోకి వచ్చింది. అంతే మూడేళ్ల వయసున్న మౌళి అనే జాగిలం తమ యజమానుల పట్ల విశ్వాసం, విధేయతతో వారిని కాపాడేందుకు నాగుపాముతో తలపడింది.చివరకు ఆ పామును చంపేసింది. అయితే, అప్పటికే అది పాముకాటుకు గురవడంతో, ప్రాణాలు వదిలింది. తాము ఎంతో ఇష్టంగా పెంచుకున్న మౌళి, తమ కోసం ప్రాణాలు వదలడంతో, గంగాధరన్ దంపతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.