కడపలో టిడిపి అభ్యర్థి బీటెక్ రవి విజయం

  Written by : Suryaa Desk Updated: Mon, Mar 20, 2017, 11:17 AM
 

కడప: కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై టిడిపి అభ్యర్థి బీటెక్ రవి 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 34 ఏళ్ళ తర్వాత కడప జిల్లాలో వైఎస్ కుటుంబసభ్యులను ఓడించి టిడిపి అభ్యర్థి రవి చరిత్ర సృష్టించారు. వైఎస్ఆర్ సిపికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో ఆ పార్టీని దెబ్బతీయాలని అధికారంలోకి వచ్చిన నాటి నుండి టిడిపి పావులు కదుపుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో వైసిపిపై ఆధిపత్యాన్ని సాధించింది. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తొలి రౌండ్ నుండి ఉత్కంఠను కొనసాగించాయి. తొలి రౌండ్ లో టిడిపి అభ్యర్థి బీటెక్ రవిపై వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టిడిపి అభ్యర్థి నాలుగు ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.అయితే మూడో రౌండ్ ముగిసే సరికి టిడిపి అభ్యర్థి బీటెక్ రవి తన సమీప వైసిపి అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 33 ఓట్ల తేడాతో విజయం సాధించారు.ఈ ఎన్నికల్లో విజయం సాధించడంపైనే అధికార టిడిపి, విపక్ష వైసిపిలు ఎత్తుకు పై ఎత్తులు వేశాయి. క్యాంపుకు వెళ్ళే ముందు టిడిపి నాయకులు తమకు ఉన్న బలాన్ని కూడ ప్రదర్శన చేశారు. ఎన్నికలకు ఒక్కరోజు ముందుగానే క్యాంపు నుండి వచ్చిన టిడిపి ప్రజా ప్రతినిధులు నేరుగా ఓటింగ్ లో పాల్గొన్నారు. 33 ఓట్ల తేడాతో వైఎస్ వివేకానందరెడ్డిపై టిడిపి విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నాయకులు హార్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.