ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎవరిపైన పవన్‌ పోరాటం ?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 20, 2017, 12:24 AM

విజయవాడ, మేజర్‌న్యూస్‌: ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించేదెవరినీ..? అన్న ప్రశ్నకు సరైన సమాధం ఎక్కడుంది. 2014 ఎన్నికల్లో కీలకపా్త్ర పోషించిన పవన్‌ రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పోటీకి దిగుతున్నట్లు ఇటీవల ప్రకటించడం పలు సందేహాలను లేవనెత్తక మానదు. తన చరిష్మాతో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, బీజేపీ విజయానికి పవన్‌ ఎంతో కీలకమయ్యారు. టీడీపీ, బీజేపీకి పవన్‌ మద్దతివ్వడం వల్లే వైసీపీ అధికారం చేజిక్కించుకోలేకపోయిందని రాజకీయ విశ్లేషకులు సైతం స్పష్టం చేశారు. అలాంటిది 2019 ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా పోటీకి దిగుతున్నట్లు పవన్‌ చెబుతున్నారు. ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ పోటీ చేస్తానని చెప్పడం గమనార్హం. సాధారణంగా కొత్త పార్టీలు అధికార, ప్రతిపక్షాలు అవంలభిస్తున్న వైఖరిని నిరసిస్తూ ప్రజల పక్షాన నిలబడతారు. ముఖ్యంగా పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు, హామీల నిరాకరణ తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు. పవన్‌ అన్నయ్య చిరంజీవి సైతం ప్రజారాజ్యం స్థాపించి ఎన్నికల్లో దిగినప్పుడూ అప్పటి అధికార పక్షం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. వైఎస్సార్‌ పాలనను ఎండగడుతూ ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం పరిస్థితులు ఎలా ఉన్నా ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షాలపై చెలరేగుతూ ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా అడుగులు వేశారు.  కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏపైనే పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించారు. ఏపీలో అధికారపక్షం ఎటువంటి ఆరోపణలు చేయకుండా సంయమనంగానే వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి హోదా విషయంలో కేంద్రం మాట నిలబెట్టుకోలేదని పవన్‌ ఘాటుగా స్పందించారు. కాకపోతే టీడీపీపైనా చంద్రబాబుపైనా విమర్శలు చేయకుండా మృదువుగానే వ్యవహరిస్తున్నారు. ఓటుకు నోటు కేసు అంశాన్ని ఇటీవల పవన్‌ ప్రస్తావించినపుడు కూడా టీడీపీ అధినేత చంద్రబాబుపై సున్నితంగానే మాట్లాడారు. పాలనలో ఎటువంటి అవాంతరాలు రాకుండా ఉండేందుకు మాట్లాడలేదని సమర్ధించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్న పరిశ్రమ స్థాపనపై పవన్‌ స్పందించారు. గోదావరి జిల్లాలోని ఉద్ధానం కిడ్నీ వ్యాధిగ్రస్థులపైనా ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. పవన్‌ స్పందించడమే తరువాయిగా ఆయా అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపట్టింది. హోదా కోసం పట్టుమీదున్న పవన్‌ అందుకని ఎక్కుడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ యేడాది జనవరి 26న హోదా కోసం వైజాగ్‌లో నిరసన కార్యక్రమంలో పవన్‌ పాల్గొంటారని ప్రచారం జరిగినా ఆఖరికి ఎటువంటి చప్పుడూ చేయలేదు. రాజధానికి భూములిచ్చిన అంశంలోనూ గతంలో పవన్‌ జోక్యం చేసుకున్నారు. బలవంతంగా రైతుల భూములు తీసుకోవాలని చూస్తే సహించేదిలేదన్నారు. తరువాత ఆ అంశంపై ఎటువంటి అడుగు ఇంతవరకూ పడలేదు. ఈ విధంగా పవన్‌ వ్యవహరిస్తోన్న తీరు అధికారపక్షానికి అనుకూలమా..? వ్యతిరేకమో..? తెలియక చాలామంది అయోమయానికి గురవుతున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత జగన్‌ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కూర్చోమంటే పవన్‌ కూర్చుంటారని, నిలబడమంటే నిలబడతారని వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ కూడా తన సామాజిక వర్గానికి బలం ఉన్న గోదావరి జిల్లాల నుంచి కాకుండా రాయలసీమలోని అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. రాయలసీమలో ప్రతిపక్ష నేతకు గట్టి పట్టున్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తుంటే పవన్‌ అధికారపక్షాన్ని కాకుండా ప్రతిపక్షాన్నే టార్గెట్‌ చేస్తున్నారని, వైసీపీ ఓట్లు చీల్చడానికే గురిపెట్టారని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలోనూ పోటీచేస్తానని పవన్‌ చెప్పారు. తెలంగాణ ఉద్యమ సాధనలో భాగంగా అఖండ మెజారిటీలో అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్‌ఎస్‌ ముందు కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలు కూడా నిలువలేకపోయా యి. తెలంగాణలోని టీడీపీ ఎమ్మెల్యేలు సైతం టీఆర్‌ఎస్‌లోకి వలస వెళ్లిపో యిన విషయం తెలిసిందే. టీడీపీ ఆంధ్రా పార్టీ అంటూ టీఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం బాగా పనిచేసింది. పవన్‌ కూడా ఆంధ్రాకు చెందిన వ్యక్తే. తెలంగాణ లోనూ పవన్‌కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ అసాధారణం. కాకపోతే యూత్‌లో ఉన్న ఆ చరిష్మా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించగలదా..? అనేది బేరీజు వేసుకోవాలి. ఈ రకంగా చూస్తే ఎన్నికల విషయానికొస్తే తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌ పవన్‌కు ఎంతో ప్రయోజనకరం. తాజాగా కాటమరాయుడు ప్రీ రిలీజ్‌ ఆడియో ఫంక్షన్‌ లోనూ ప్రముఖ చానళ్ల యజమానులు హాజరై పవన్‌కు అనుకూల సంకేతాలు అందిం చారు. పవన్‌కు మద్దతుగా నిలుస్తామని ఓ యజ మాని స్పష్టం చేయడం అభిమానులను ఉత్సాహపరిచింది. ఇటువంటి సంఘట నల దరిమి లా త్వరలో పవన్‌ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ఎన్నికలకు సిద్ధమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఏపీలో పవన్‌ పోరాటం అధికారపక్షం పైనా, ప్రతిపక్షంపైనా లేకపోతే ఇరుపక్షాలపైనా అనే స్పష్టత ఓటర్లకు అర్థంకావడం జనసేనకు మరింత ప్రయోజనం. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com