ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోహ్లిని తప్పుబడుతున్న హీలీ..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 10:01 AM

‘‘ఆస్ట్రేలియా ఆటగాళ్లపై స్లెడ్జింగ్‌ చేస్తున్న విరాట్‌ కోహ్లిపై నాకు గౌరవం పోతోంది’’


ఆసీస్‌ మాజీ వికెట్‌ కీపర్‌ ఇయాన్‌ హీలీ వ్యాఖ్యలివి!


ఎదుటివారి వైపు ఒకవేలు చూపిస్తే.. నాలుగు వేళ్లు మనల్ని చూస్తాయన్న సంగతి హీలీ మరిచినట్లున్నాడు! కోహ్లిని తప్పుబడుతున్న హీలీ.. సమీక్ష విషయంలో తమ సొంత కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ తుంటరి పనిపట్ల నోరుమెదపకపోవడం అతని తెంపరితనానికి నిదర్శనం!


క్రికెట్‌కు ఇంగ్లాండ్‌ పుట్టిల్లు అయితే స్లెడ్జింగ్‌కు ఆస్ట్రేలియా మారుపేరు! స్లెడ్జింగ్‌ను క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేసిందే ఆసీస్‌. ఇయాన్‌ ఛాపెల్‌ సారథ్యంలో మొదలైన స్లెడ్జింగ్‌ను పెంచి.. పోషించి పతాక స్థాయికి తీసుకెళ్లిన ఘనత కంగారూలదే. స్లెడ్జింగ్‌లో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రమాణాలు సృష్టించిన ఘనత కూడా వారిదే! వికెట్ల వెనుక ఫీల్డింగ్‌ చేస్తూ.. బ్యాట్స్‌మెన్‌ను తిట్టడం, వెకిలి చేష్టలతో కోపమొచ్చేలా చేయడం, భార్య లేదా ప్రేయసి గురించి చెడుగా మాట్లాడుతూ ఏకాగ్రత కోల్పోయేలా చేయడం ఆసీస్‌ ఆటగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఆటతో బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయలేక.. వంకర దారిలో వికెట్లు పడగొట్టిన సందర్భాలు కోకొల్లలు. క్రికెట్‌ చరిత్రలో స్లెడ్జింగ్‌ ఉదంతాల రికార్డులు తిరగేస్తే నూటికి 99 శాతం ఆసీస్‌ ఆటగాళ్లవే ఉండటం ఖాయం. డెన్నిస్‌ లిల్లీ- మియాందాద్‌ (పాకిస్థాన్‌), రాడ్‌ మార్ష్‌- ఇయాన్‌ బోథమ్‌ (ఇంగ్లాండ్‌), ఇయాన్‌ హీలీ- అర్జున రణతుంగ (శ్రీలంక), గ్లెన్‌ మెక్‌గ్రాత్‌- ఎడొ బ్రాండెస్‌ (జింబాబ్వే), మార్క్‌ వా- జేమ్స్‌ ఆర్మాండ్‌ (ఇంగ్లాండ్‌), మెర్వ్‌ హ్యూస్‌- వివ్‌ రిచర్డ్స్‌ (వెస్టిండీస్‌), షేన్‌ వార్న్‌- డరైల్‌ కలినాన్‌ (దక్షిణాఫ్రికా).. ఇలా చెప్పుకుంటూ పోతే ఆసీస్‌ ఆటగాళ్ల స్లెడ్జింగ్‌ చరిత్రకు అంతే ఉండదు! ఒకానొక సమయంలో లిల్లీ, మియాందాద్‌ మైదానంలో కొట్టుకునే వరకు వెళ్లడం క్రికెట్‌ ప్రపంచం ఇంకా మరిచిపోలేదు!


ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్‌లో.. రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య కాస్త మసాలా ఉండటం సహజం. స్లెడ్జింగ్‌ కానీ.. మాటల దాడి కానీ కొంత వరకే. మైదానంలో ఉన్న ఆటగాళ్లకు.. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు.. టీవీ సెట్ల ముందుండే అభిమానులకు ఆమోదయోగ్యంగా అనిపించినంత వరకే. అంతేగానీ శ్రుతి మించి ప్రవర్తించడం ఏ జట్టుకూ తగదు. ఐతే ఈ సిరీస్‌ కోసం ఆసీస్‌ ఆటగాళ్లే పకడ్బందీగా స్లెడ్జింగ్‌కు తెరతీశారు. కోహ్లిని ఔట్‌ చేస్తే టీమ్‌ఇండియా తలలేని పాము అంటూ కెప్టెన్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు.కోహ్లిని మానసికంగా దెబ్బతీసే ఎత్తుగడలో భాగమే ఈ వ్యాఖ్యలు. ఇక డీఆర్‌ఎస్‌ విషయంలో ఆసీస్‌ ఆటగాళ్ల తీరు యావత్‌ క్రికెట్‌కే మచ్చ. రెండో టెస్టులో నాలుగో రోజు ఆటలో సమీక్ష కోరాలా? వద్దా? అంటూ స్మిత్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు సంకేతాలు పంపడం వరకే మనకు తెలుసు! కానీ సిరీస్‌లో మొదట్నుంచీ సమీక్షల విషయంలో ఆసీస్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ సహాయం తీసుకుంటుందంటూ అంపైర్లకు ఫిర్యాదు చేసినట్లు కోహ్లి వెల్లడించాడు. కోహ్లి చెప్పిందే నిజమైతే ఆసీస్‌ది క్షమించరాని నేరం. క్రీడాస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. తొలి టెస్టుతో సహా ఇప్పటివరకు ఆసీస్‌ది అక్షరాలా తొండాటే. రివ్యూ ఘటనలో స్మిత్‌ స్థానంలో భారత ఆటగాడే ఉండుంటే విదేశీ మీడియా ఎంతెత్తున ఎగిరేదో!


తప్పులన్నీ వారి దగ్గరే పెట్టుకుని కోహ్లిని లక్ష్యంగా చేసుకోవడం ఆసీస్‌కే చెల్లింది. పైగా.. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ పట్ల గౌరవం పోతోందంటూ మొసలి కన్నీరు! క్రికెట్లో స్లెడ్జింగ్‌కు శ్రీకారం చుట్టి.. ఆట మీద గౌరవం పోయేలా చేసిన కంగారూలే ఇప్పుడు స్లెడ్జింగ్‌కు బాధితులమైనట్లు మాట్లాడుతుండటం విడ్డూరమే. ఐసీసీ నిబంధనలు కాస్త కఠినం కావడంతో ఆసీస్‌ ఆటగాళ్లు వెనక్కి తగ్గారు గానీ వారిని మించిన స్లెడ్జింగ్‌ వీరులు క్రికెట్లో ఉండరు. ఆసీస్‌ ఆటగాళ్లు తాము తప్పులు చేస్తూ ఎదుటివారిని నిందించడం ఇప్పటికైనా మానుకోవాలి. క్రీడాస్ఫూర్తి రెండు వైపులా ఉండాలన్న సంగతీ గుర్తించాలి! అప్పుడే జెంటిల్‌మెన్‌ ఆటకు సార్థకత!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com