అమ్మ ప్రకటించిన పథకాలన్నీ అమలు చేస్తా! పళనిస్వామి

Updated: Thu, Mar 09, 2017, 09:34 AM
 

చెన్నై: రాష్ట్రంలో 140 ఏళ్లలో ఎన్నడూ కానరాని కరవు ప్రస్తుతం తాండవిస్తోందని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. ఈ కరవు నుంచి రైతులను కాపాడతామని ఆయన భరోసా ఇచ్చారు. తిరునెల్వేలిలో బుధవారం తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి జిల్లాలకు సంబంధించిన రూ.235 కోట్ల విలువైన పథకాలను ప్రారంభించారు. పలువురు లబ్ధిదారులకు సహాయనిధిని అందజేశారు. తిరునెల్వేలి నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే ప్రభుత్వ బస్సులను జెండా వూపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పళనిస్వామి మాట్లాడుతూ శాసనసభలో 110 నిబంధన కింద ‘అమ్మ’ ప్రకటించిన పథకాలన్నీ అమలు చేశామన్నారు. మిగిలిన పథకాలను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాగ్దానాలను ప్రకటించి వాటిని నెరవేర్చలేక సతమతమవుతున్న విషయం ప్రజలకు అర్థమవుతోందన్నారు. ‘పురట్చి తలైవి’ జయలలిత ఓ పథకాన్ని ప్రకటించే ముందు దాన్ని సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారన్నారు. జాలర్లకు అత్యంత సన్నిహితుడిగా ఎంజీఆర్‌ వ్యవహరించారని తెలిపారు. అదే మార్గంలోనే జయలలిత కూడా జాలర్ల సంక్షేమానికి కృషి చేశారన్నారు. జయలలిత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మొత్తం 2,541 మంది జాలర్లను శ్రీలంక నుంచి విడుదల చేశారని తెలిపారు. అమ్మ దారిలో వెళుతున్న ఈ ప్రభుత్వం కూడా జాలర్లకు మద్దతుగా వ్యవహరిస్తుందన్నారు. మంగళవారం తిరుచ్చిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న పళనిస్వామి రాత్రి తిరునెల్వేలికి చేరుకున్నారు. ఆయనను మంత్రులు కడంబూర్‌ రాజు, రాజలక్ష్మి, తూత్తుకుడి అన్నాడీఎంకే కార్యదర్శి చెల్లపాండియన్‌ తదితరులు స్వాగతించారు. ఇదిలా ఉండగా తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టిలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ఆయనే పలువురు పేదలకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు విజయభాస్కర్‌, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Andhra Pradesh E-Paper


Telangana E-Paper