ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరల్డ్ రిమోట్‌ అమెరికా చేతిలో ఉన్నది! ఎక్కడి నుంచైనా... ఏదైనా వినగలిగే అమెరికా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 09, 2017, 09:10 AM

కూర్చొన్నచోట నుంచి కదలకుండానే రిమోట్‌తో టీవీలో కార్యక్రమాలను మార్చుకున్నట్టే ఎక్కడో కూర్చొని, ప్రపంచంలో ఎక్కడికైనా కళ్లు-చెవులు పంపించగలిగే సత్తా అమెరికాకు ఉందని మరోసారి రుజువయింది. మన చేతిలోని స్మార్ట్‌ఫోన్లను, మన ఇళ్లలోని అధునాతన టీవీలనే సాంకేతికంగా వినియోగించుకుని సమాచార చౌర్యానికి పాల్పడగల సామర్థ్యం అమెరికా నిఘా సంస్థకు ఉందని వికీలీక్స్‌ పత్రాలతో వెల్లడయింది. ఎక్కడో ఉన్న ఒక పరికరాన్ని ఆన్‌ చేయడం, ఆఫ్‌ చేయడం కూడా అమెరికాకు సాధ్యమవుతుందని ఈ పత్రాలు చెబుతున్నాయి. విస్తారమైన సమాచారం ఈ ప్రక్రియలో పెద్దన్న చేతిలో పడుతుంది. ఒక వ్యక్తి ఏ ప్రాంతంలో ఉన్నారు? ఎలాంటి సందేశాలు ఎవరికి పంపిస్తున్నాడు? అనే వివరాలే కాకుండా ప్రతీదీ సూక్ష్మఫోన్లు ద్వారా వినడం, కెమేరా ద్వారా చూడడం సీఐఏకి సాధ్యమవుతోంది. ఇది బయట ప్రపంచానికి తెలిశాక అనేక యాప్‌ల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోయింది. కొన్ని యాప్‌ల ద్వారా పంపే సందేశాలు అవతలివారికి చేరడానికి ముందే సీఐఏ తెలుసుకోగలదని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆపరేటింగ్‌ సిస్టం (ఒ.ఎస్‌.) తగినంత భద్రతతో కూడినది కాకపోతే ప్రయోజనమేమీ లేదని వికీలీక్స్‌ విశ్లేషిస్తోంది. ఇళ్లలోని స్మార్ట్‌ టీవీలను స్విచాఫ్‌ చేసిన తర్వాత కూడా అవి మన మాటల్ని కావాల్సిన వారికి సాఫ్ట్‌వేర్‌ను నిఘా సంస్థలు చొప్పించగలవని వెల్లడిస్తోంది.


ప్రమాదాలు తక్కువేం కాదు: హ్యాకింగ్‌ వల్ల సమాచార తస్కరణే కాకుండా కార్ల వంటి వాహనాలనూ అదుపులోకి తీసుకుని వాటిని ప్రమాదాలకు గురి చేయడానికీ ఆస్కారం ఉంటుంది. అలాంటి కల్పిత ప్రమాదాల్లో ఎవరినైనా హతమారిస్తే హంతకుల్ని గుర్తించడమూ కష్టమే..! కార్లు, వ్యాన్లను రిమోట్‌తో నియంత్రించే అవకాశాల కోసం అమెరికా నిఘా సంస్థ చూస్తోందని లభ్యమైన ఒక పత్రం వెల్లడిస్తోంది. వెలుగుచూసిన 8378 పత్రాల్లో కొన్నింటినే ఇప్పటి వరకు విశ్లేషించారు. వీటిని వెబ్‌సైట్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చి మరిన్ని వివరాల సేకరణకు వికీలీక్స్‌ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రసార మాధ్యమాలతో ఘర్షణ పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు వికీలీక్స్‌ పత్రాలు మరో ఇబ్బందిని తెచ్చిపెట్టాయి. అమెరికాకు ఉన్న సైబర్‌ సామర్థ్యాన్ని ఈ పత్రాలు రుజువు చేస్తున్నాయనే వాదనా లేకపోలేదు. తాజా పత్రాల వెనకా రష్యా పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


                                               కాదేదీ గూఢచర్యానికి అనర్హం....


వికీలీక్స్‌ తాజాగా బయటపెట్టిన పత్రాల్లో.. అమెరికా నిఘా సంస్థ సీఐఏ తాను లక్ష్యంగా చేసుకున్నవారిపైన గూఢచర్యానికి పాల్పడేందుకు ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలను ఎలా హ్యాక్‌ చేస్తుందన్న సమాచారాన్ని వెల్లడించింది. వీపింగ్‌ ఏంజెల్‌, మ్యాజికల్‌ మట్‌, ఫైన్‌ డైనింగ్‌, రాయిడ్‌రేజ్‌ అనే సంకేతనామాలతో రూపొందించిన టూల్స్‌ను సీఐఏ వాడుకుంటున్న తీరు గురించి ఆశ్చర్యకర వివరాలు బయటపెట్టింది. ఉదాహరణకు సీఐఏ రూపొందించిన ఫైన్‌ డైనింగ్‌ పద్ధతిలో ఓ వ్యక్తి విండోస్‌ ఆధారిత కంప్యూటర్‌ నుంచి సమాచారాన్ని పెన్‌డ్రైవ్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకునే వీలు ఉంటుంది. పైకి మాత్రం ఆ విషయం తెలియకుండా.. యాంటీ వైరస్‌ సంబంధిత స్కానింగ్‌ జరుగుతున్నట్లుగానో మరో విధంగానో చూపిస్తుంది. ఇక ఈవ్‌ అనే టూల్‌ను ఉపయోగించి ఆపిల్‌ సాధనాల మైక్రోఫోన్లు, కెమెరాలు, సందేశాలు, ప్రదేశ వివరాలు అన్నీ సీఐఏ తన అధీనంలోకి తెచ్చుకోగులుగుతుంది. వీపింగ్‌ ఏంజెల్‌ అనే టూల్‌ ద్వారా శామ్‌సంగ్‌ స్మార్ట్‌ టీవీలను హ్యాక్‌ చేయొచ్చు. టీవీ ఆఫ్‌ చేసి ఉన్నట్లుగా కనిపించేలా చేసి.. దాని మైక్రోఫోన్‌ ద్వారా అక్కడ జరిగే సంభాషణలను వినొచ్చు. అమెరికా, బ్రిటన్‌లోని వివిధ సంస్థలు రూపొందించిన టూల్స్‌ను కూడా సీఐఏ వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com