సచివాలయంలో స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్ బోర్డ్ సమావేశం

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 20, 2018, 05:31 PM
 

అమరావతి : ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన సచివాలయంలో స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్ బోర్డ్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చెయ్యడానికి తీసుకోవాల్సిన చర్యల పై చర్చ జరిగింది. స్మార్ట్ విలేజ్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం పనులు జరుగుతున్న 28 గ్రామాలను మోడల్ స్మార్ట్ విలేజెస్ గా తీర్చిదిద్దాలని నారా లోకేష్ చెప్పారు. ఇప్పటికే గుర్తించిన 660 గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాలని సూచించారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఎంపిక చేసిన 688 గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాన్నారు. దాతలు ఇచ్చే నిధులు, ప్రభుత్వ నిధులను అనుసంధానంతో పనులను వేగంగా పూర్తి చెయ్యాలని, ఉపాధిహామీ పథకంలో భాగంగా 12918 గ్రామాలకు అవసరం ఉన్న పనులను గుర్తించి ఆన్ లైన్ లో ఉంచాన్నారు. 


విదేశాల్లో ఉన్న దాతలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వివిధ కంపెనీలు సులభంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యి నిధులు నేరుగా ఇచ్చేందుకు వెబ్ సైట్ లో అవకాశం కల్పించాలని చెప్పారు. వచ్చే రెండు నెలల్లో స్మార్ట్ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా విదేశాల్లో ఉన్న దాతలు,కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా వివిధ కంపెనీల నుండి వంద కోట్లు సమికరించి, ప్రభుత్వం భాగంగా వంద కోట్లు కేటాయించి,రెండు వందల కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి అని నిర్ణయించారు. ఇప్పటికే 2,400 మంది దాతలు స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్లో భాగస్వామ్యం అవగా రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాలకు దాతలు ఉండేలా స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్ కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మెన్ కుటుంబరావు, పంచాయతీ రాజ్ డైరెక్టర్ రంజిత్ బాషా, ఏపీఎన్ఆర్టి సిఈఓ రవి వేమూరి, స్మార్ట్ ఆంధ్రా ఫౌండేషన్ ప్రతినిధులు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.