రైతురాజ్యం కోసం పోరాడుదాం: బైరెడ్డి

  Written by : Suryaa Desk Updated: Mon, Aug 20, 2018, 03:44 PM
 

కర్నూలు: రైతు రాజ్యం కోసం ప్రాణాలను పణంగా పెట్టైన పోరాడుదామని కాంగ్రెసు పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం గూడూరు మండలం నాగులాపురం, కల్లూరు మండలం పర్ల గ్రామాల్లో కేంద్ర మాజీ సహాయ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా రైతు జన చైతన్య యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పట్టించుకోవడం లేదన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఎంతో మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్న, రైతుల గురించి అవిశ్వాస తీర్మానాలు పెట్టకపోవడం శోచనీయమన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలను గద్దె దింపెందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 


సెప్టెంబర్ 18న కర్నూలు ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్ లో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభతోనే రాష్ట్రంలో రాజకీయ సునామి మొదలవుతుందని, ఈ సునామిలో ప్రాంతీయ పార్టీలు కొట్టుకపోక తప్పదన్నారు. చంద్రబాబు అవినీతి పాలనతో ప్రజలు విసుగెత్తి పోతున్నారన్నారు. రాజధాని నిర్మాణం పేరిట కోట్లు దండుకుంటున్నారన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని సింగపూర్ మాదిరి తయారు చేస్తామని గొప్పలు చెబుతున్నారని, అమరావతి కంటే కర్నూలు పక్కన ఉన్న అలంపూర్ మేలన్నారు. జగన్ చెప్పులు అరిగిపోయేంత వరకు పాదయాత్ర చేసిన ముఖ్యమంత్రి కాలేడన్నారు. సినిమా స్క్రిప్టులతో పవన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. ప్రాంతీయ పార్టీలతో ఎలాంటి అభివృద్ధి జరగదని, కాంగ్రెసు పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెసు పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.