ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2021కి సగం విపణి జియోదే! నిర్వహణ మార్జిన్లు 50 శాతం డేటాకు నెలకు రూ.500 40 కోట్ల మందికి ఆ సత్తా పరిశ్రమ ఆదాయం రూ.3 లక్షల కోట్లకు మూడోవంతుకు తగ్గనున్న వాయిస్‌ ఆదాయం విశ్లేషకుల సమావేశంలో రిలయన్స్‌ జియో దిల్లీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2017, 10:35 AM

సేవలు ప్రారంభించిన 6 నెలల్లోపే 10 కోట్ల మంది చందాదార్లను సాధించిన రిలయన్స్‌ జియో, భవిష్యత్తు లక్ష్యాలను మరింత ఘనంగా నిర్దేశించుకుంది. దేశీయ టెలికాం రంగ ఆదాయంలో 50 శాతం వాటాను 2021 కల్లా సాధించడమే తమ లక్ష్యమని చాటింది. మొబైల్‌పై అత్యధిక వేగం డేటా బదిలీ సేవల (4జీ)ను దేశవ్యాప్తంగా పరిచయం చేసిన సంస్థ, రాబోయే అయిదేళ్లలో ఈ విభాగమే టెలికాం పరిశ్రమకు ఆధారమవుతుందని పేర్కొంది. తమ నిర్వహణ మార్జిన్లు కూడా 50 శాతానికి పైగానే ఉంటాయనే భరోసాను ఇక్కడ జరిగిన విశ్లేషకుల సమావేశంలో రిలయన్స్‌ జియో వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో జియో ఉన్నతస్థాయి యాజమాన్యం వెల్లడించిన అంశాలివీ..


డేటా గిరాకీ ఎంతో 


జియో నెట్‌వర్క్‌పై రూ.1.8 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఆశించినట్లే దేశంలో డేటాకు అధిక గిరాకీ లభిస్తోంది. డేటా సేవల కోసం నెలకు రూ.500 చెల్లించే సామర్థ్యం కలిగిన చందాదార్లు 40 కోట్ల మంది ఉన్నారు. ఇది సంస్థకు ఆర్థికంగా బాగా కలిసి రానుంది. 5జీ సేవలకు సిద్ధంగా ఉన్న నెట్‌వర్క్‌ ఇదే.


జియోకు ఇతర సంస్థలకు తేడా: అన్ని రకాల ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌పై జియో 4జీ బ్రాడ్‌బ్యాండ్‌ మొబైల్‌ సేవలు పొందొచ్చు. ఇందువల్ల అధిక డేటా బదిలీ సాధ్యమవుతోంది. భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ ఇప్పటికీ సంప్రదాయ సర్క్యూట్‌ స్విచ్‌డ్‌ సాంకేతికతనే వాడుతున్నారు. ఇందులో డేటా బదిలీకి పరిమితులుంటాయి. జియో టవర్లలో 60 శాతాన్ని ఆప్టిక్‌ ఫైబర్‌తోనూ అనుసంధానించాం. పరిశ్రమలో ఈ సగటు 20 శాతమే.


నెలకు 100 కోట్ల జీబీ డేటా వినియోగం


2016 సెప్టెంబరులో జియో సేవలు ఆరంభమయ్యాక, నెలకు వినియోగించే డేటా 100 కోట్ల జీబీకి చేరింది. ప్రస్తుతం దేశీయంగా జరుగుతున్న డేటా బదిలీలో 85 శాతం జియో నెట్‌వర్క్‌పైనే సాగుతోంది. ఫలితంగా ప్రపంచంలోనే మొబైల్‌ డేటా అత్యంత ఎక్కువగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానానికి చేరింది. జియో రాకముందు దేశీయంగా నెలకు 20 కోట్ల జీబీ డేటా వినియోగమయ్యేది. అప్పట్లో 1 జీబీ డేటాకు టెలికాం సంస్థలు రూ.250 వసూలు చేయడం, వినియోగం పరిమితంగా ఉండేందుకు ప్రధాన కారణం. 2020-21కి డేటా గిరాకీలో 60 శాతాన్ని సంస్థ బదిలీ చేస్తుంది.


ఆదాయం కాల్స్‌ నుంచి డేటాకు బదిలీ 


2021కి టెలికాం పరిశ్రమ ఆదాయం రూ.3 లక్షల కోట్లకు చేరనుంది. ప్రస్తుతం వాయిస్‌ కాల్స్‌ ఆదాయం రూ.1.50 లక్షల కోట్లు కాగా, ఇది రూ.50,000 కోట్లకు పడిపోనుంది. ఇదే క్రమంలో డేటా ఆదాయం రూ.1.50 లక్షల కోట్లకు పెరుగుతుంది. అప్పుడు నెలకు 500-600 కోట్ల జీబీ డేటా వినియోగం జరగవచ్చు. గిరాకీ పెరిగే కొద్దీ, ప్రభుత్వానికి ఆదాయం కూడా 50 శాతం అధికమవుతుంది. జీబీ డేటాకు రూ.50 చొప్పున గణించినా, ఏడాదికి రూ.3-3.6 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. జీడీపీలో ఇది 1.35-1.6 శాతానికి సమానం. కనెక్షన్ల సంఖ్య 113 కోట్ల నుంచి 80 కోట్లకు తగ్గిపోతుంది.


సభ్యులకు మరో 5 జీబీ డేటా: జియో:


దిల్లీ: రూ.99తో వార్షిక సభ్యత్వం తీసుకుని, నెలకు రూ.303తో రీఛార్జి చేసుకున్న వారికి మరో 5 జీబీ ఉచితంగా అందిస్తామని రిలయన్స్‌ జియో తెలిపింది. ఈ పథకం కింద అపరిమిత కాల్స్‌, రోజుకు 1 జీబీ చొప్పున 28 రోజులకు 28 జీబీ అత్యధిక వేగం 4జీ డేటాను అందిస్తామని జియో ప్రకటించింది. దీనికి అదనంగా మరో 5జీబీ డేటా ఇస్తామని శుక్రవారం వెల్లడించింది. రోజులో 1జీబీ వాడాక, ఈ డేటా నుంచి వాడుకోవచ్చు. ఇదేవిధంగా రూ.499తో రీఛార్జి చేసుకున్న వారికి 10 జీబీ డేటా అదనంగా ఇవ్వనుంది. మొదటి నెలకే ఇది వర్తిస్తుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com