అణుపరీక్ష కేంద్రాన్ని ధ్వంసం చేసిన ఉత్తర కొరియా

  Written by : Suryaa Desk Updated: Thu, May 24, 2018, 04:54 PM
 

ప్యోంగ్యాంగ్: అణు పరీక్షలు నిర్వహించే టన్నల్స్‌ను నార్త్ కొరియా ఇవాళ ధ్వంసం చేసింది. ప్రాంతీయ ఉద్రిక్తలను తగ్గించాలన్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ చర్యకు పాల్పడింది. అంతేకాదు త్వరలో అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్‌తో జరగనున్న సమావేశానికి కూడా లైన్ క్లియర్ చేసుకున్నది. పంగీ రీ న్యూక్లియర్ టెస్ట్ సైట్ దగ్గర ఇవాళ భారీ పేలుడు జరిగింది. అంతర్జాతీయ జర్నలిస్టుల సమక్షంలోనే అణు పరీక్ష కేంద్రాన్ని పేల్చేశారు. అమెరికాతో దౌత్యపరమైన సంబంధాలను ఆశిస్తున్న నేపథ్యంలో.. ఉత్తర కొరియా ఈ చర్యకు పాల్పడింది. కానీ సైంటిస్టులు మాత్రం మరో మాట చెబుతున్నారు. 2017 సెప్టెంబర్‌లో జరిగిన అణుపరీక్ష సమయంలోనే ఆ సైట్ పాక్షికంగా దెబ్బతిన్నదని, ఆ కారణంగా న్యూక్లియర్ సైట్ పునర్ వినియోగానికి పనికిరాకుండా పోయిందన్నారు. పంగీ రీ సైట్‌కు అంతర్జాతీయ నిపుణులు వెళ్లారు. దాదాపు 500 మీటర్ల దూరం నుంచి ఆ న్యూక్లియర్ సైట్ పేల్చివేతను వీక్షించినట్లు జర్నలిస్టులు తెలిపారు.