ఊరు సమస్య తీర్చడం కోసం నడుం బిగించిన తాత

  Written by : Suryaa Desk Updated: Thu, May 24, 2018, 01:08 PM
 

మధ్య ప్రదేశ్‌లోని ఛతార్‌పూర్‌కు సమీపంలోని హదువా గ్రామానికి చెందిన 70 ఏండ్ల సీతారాం రాజ్‌పుత్ ఒక్కడే ఊరులో బావిని తవ్వుతున్నాడు. గత రెండున్నర సంవత్సరాల నుంచి ఆ ఊరులో నీటి సమస్య ఉన్నదట. అయితే.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వమూ, ఏ అధికారులూ పట్టించుకోలేదట. ఊరు ప్రజలు కూడా నీటి సమస్య ఉన్నా ఎవరూ ఆ సమస్యను అధిగమించే మార్గలను వెతకలేదు. కాని.. ఈ తాత మాత్రం తనకు తోచిన ఉపాయంతో బావిని తవ్వడం ప్రారంభించాడు. గత కొన్ని రోజులుగా బావిని తవ్వుతున్న సీతారాం.. "ఇప్పటి వరకు సగం బావిని తవ్వా. ఇంకా కొన్ని రోజులు తవ్వితే నీళ్లు పడే అవకాశం ఉంది. దీంతో ఊరి కష్టాలు తీరిపోతాయి. అయితే.. ఒక్కడినే బావిని తవ్వడం కష్టంగా మారింది. ఊరులోని నీటి యెద్దడిపై అటు అధికారులూ, ఇటు ఊరి ప్రజలూ పట్టించుకోలేదు. అందుకే నేనే తవ్వడం ప్రారంభించాను.." అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు సీతారాం. 70 ఏడ్ల ఓ తాత తన ఊరులో ఉన్న నీటి సమస్యను తీర్చడం కోసం నడుం బిగించాడు. ఎవ్వరూ ముందుకు రాకున్నా తానే చొరవ తీసుకొని ఊరులో బావిని తవ్వడం ప్రారంభించాడు.