భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కోసం ఇచ్చిన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరస్కరించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంపై న్యాయకోవిదుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వెంకయ్యనాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిశంసన నోటీసుపై కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, ఎన్సీపీ, బీఎస్పీ, ముస్లిం లీగ్ సభ్యులు సంతకాలు చేశారు. మొత్తం ఐదు రకాల దుష్ప్రవర్తన ఆధారంగా ఈ నోటీసు తీసుకువచ్చాయి ప్రతిపక్ష పార్టీలు. ఇప్పటి వరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయినప్పటికీ అసాధారణ రీతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి.