యూపీలో నరేంద్ర మోదీ విగ్రహం ధ్వంసం

  Written by : Suryaa Desk Updated: Fri, Mar 09, 2018, 09:40 AM
 

దేశవ్యాప్తంగా జరుగుతున్న విగ్రహాల విధ్వంసం నరేంద్ర మోదీ వరకూ విస్తరించింది. గడచిన నాలుగు రోజుల వ్యవధిలో లెనిన్, పెరియార్ రామస్వామి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీల విగ్రహాలు ధ్వంసంకాగా, తాజాగా, గత రాత్రి ఉత్తరప్రదేశ్ లోని కౌషంబీ జిల్లా భగవాన్ పూర్ లో ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ గ్రామంలో 2014లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేత బ్రజేంద్ర నారాయణ్ మిశ్రా ఈ విగ్రహాన్ని ఓ శివాలయంలో ఏర్పాటు చేయగా, గ్రామస్థులు పూజలు కూడా చేస్తుండేవారు. ఈ విగ్రహం ముక్కును ధ్వంసం చేశారని తెలియడంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి వచ్చి తమ నిరసన తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేస్తున్నామని తెలియజేశారు. మోదీ విగ్రహం ధ్వంసం నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు.