న్యూయార్క్: సంపన్నులు ప్రభుత్వాలకు పన్నులు చెల్లించాలని మరోసారి బిలియనీర్ బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. తాను కూడా ప్రభుత్వానికి మరింత అధికంగా పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇతర కుబేరులు కూడా తమ తమ ప్రభుత్వాలకు పన్నులు యధావిధిగా చెల్లించాలని ఆయన కోరారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ప్రస్తుత ఆస్తుల విలువ సుమారు 9000 కోట్ల డాలర్లు. నేను పన్నులు ఎంతో కట్టాను, అది సుమారు వెయ్యి కోట్ల డాలర్లు ఉంటుంది, నాలాంటి స్థాయిలో ఉన్న ఇతర సంపన్నులు కూడా ప్రభుత్వానికి ఇలా పన్ను కట్టాలని బిల్‌గేట్స్ ఓ ఇంటర్వ్యూలో సూచించారు. అమెజాన్ ఓనర్ జెఫ్ బేజోస్ ప్రస్తుతం వరల్డ్‌లో టాప్ సంపన్నుడిగా నిలిచారు. రెండవ స్థానంలో బిల్‌గేట్స్ కొనసాగుతున్నారు. కొత్తగా ట్రంప్ ప్రవేశపెట్టిన పన్నుల బిల్లు విప్లవాత్మకంగా లేదని, అది తిరోగమనంగా ఉందని గేట్స్ అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ల ట్యాక్స్ బిల్లు వల్ల సూపర్ రిచ్లకే ఎక్కువ ఉపయోగం జరుగుతుందన్నారు.