రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు: మంత్రి సోమిరెడ్డి

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 03:17 PM
 

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం మంత్రులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లి సహా రాష్ట్రంలో పోరాడుతున్నామన్నారు. చంద్రబాబు 29 సార్లు వెళ్లి విభజన హామీలపై ప్రస్తావించారని గుర్తు చేశారు. వైసీపీ రాజీనామాల పేరుతో కొత్త నాటకానికి తెరతీసిందని విమర్శించారు. ఇంతకు ముందు రాజీనామాలు చేస్తామని చెప్పారని ఇంకా ఎంత కాలం ప్రజలను మభ్య పెడతారు? అని ప్రశ్నించారు. మాకు రాజీనామాలు చేయడం పెద్ద విషయం కాదని, ఇంతకంటే పెద్ద పదవులు తాము చూశామన్నారు. విభజన హామీలపై వ్యూహాత్మకంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మార్చి 5వ తేదీ వరకూ విభజన హామీలపై కేంద్రం ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుందన్న దాని కోసం వేచి చూడాలని నిర్ణయించింది. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి  త్యాగాలకు తెలుగుదేశం పార్టీ ఎన్నడూ వెనుకాడదన్నారు. పదవులు తమకు ముఖ్యం కాదని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రకటించారు. హోదాతో సమానంగా అన్ని సదుపాయాలూ కల్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సోమిరెడ్డితో పాటు మంత్రులుఅచ్చన్నాయుడు తదితరులు కూడా పాల్గొన్నారు.