కేంద్రం నిధులు ఇస్తుంద‌న్న ఆశ లేదు : జేసీ

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 02:44 PM
 

చంద్రబాబు నాయుడు అంటే ప్రధాని నరేంద్ర మోడీకి ఈర్ష్య అని ఎంపీ జేసీ దివాకరరెడ్డి అన్నారు. ఏపీకి ఏ చేయూతా ఇవ్వకుండానే సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారనీ, అన్ని ఇస్తే రాజకీయంగా ఇంకా ఎదిగిపోతారన్న భయంతోనే మోడీ ఏపీ పట్ల పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. విభజన హామీలను కేంద్రంలోని మోడీ సర్కార్ నెరవేరుస్తుందన్న నమ్మకం తనకైతే పోయిందని జేసీ స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు విషయంలో గట్టి నిర్ణయం తీసుకోవలసిన అవసరం, సమయం వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన హామీలనలు ఎలా సాధించుకోవాలో తెలుగుదేశం పార్టీకి తెలుసునన్నారు. ప్యాకేజీ పేరుతో కేంద్రం నిధులిస్తుంద‌న్న ఆశ అయితే లేదని అన్నారు. గ‌తంలో చంద్ర‌బాబు థ‌ర్డ్ ఫ్రంట్ లో కీల‌కంగా ఉన్నారని, మ‌ళ్లీ అలాంటి భ‌య‌మే బీజేపీకి ఉండొచ్చని జేసీ చెప్పారు. ప్ర‌స్తుత‌మున్న స్థాయి కంటే చంద్ర‌బాబు మ‌రింత ఉన్న‌త స్థాయికి ఎద‌గాల‌ని అంబానీ లాంటి వ్య‌క్తే కోరుకున్నారని చెప్పిన జేసీ ఏపీకి జ‌రిగిన అన్యాయంపై కాంగ్రెస్ స‌హా అన్ని జాతీయ పార్టీల మ‌ద్ద‌తు కోరామ‌ని వెల్ల‌డించారు. 
జ‌గ‌న్ త‌న ఎంపీల‌తో ఎప్పుడో రాజీనామా చేయిస్తే ఉప ఎన్నిక‌లు రావ‌ని, ఇప్పుడే రాజీనామాలు చేస్తే ఉప ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉందిని జేసీ టీడీపీ కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తే బీజేపీ వాళ్ల‌కు మోడీ మంత్రులుగా అవ‌కాశం ఇస్తారు త‌ప్ప ప్ర‌త్యేక లాభం ఉండ‌దని అన్నారు. జగన్ రాజీనామాల ప్రకటనతో కొత్త నాటకానికి తెరతీశారని అన్నారు. ఏప్రిల్ లో రాజీనామాలు చేస్తే ఉపఎన్నికలు రావన్న ఉద్దేశంతోనే తమ ఎంపీలు రాజీనామాలు అప్పుడు చేస్తారని జగన్ ప్రకటించారని జేపీ ఆరోపించారు. దమ్ముంటే జగన్ తమ పార్టీ ఎంపీలతో ఇప్పుడే రాజీనామా చేయింయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రాష్ట్రప్రగతి, పురోగతి కోసం అరహారం కష్టపడుతున్నారనీ, కేంద్రం మాత్రం ఇసుమంతైనా చేయూత ఇవ్వడం లేదని జేసీ అన్నారు. పార్లమెంటులో వైకాపా ఎంపీల తీరు దారుణంగా ఉందని అన్నారు. ఒక వైపు బడ్జెట్ బ్రహ్మాండం అంటూ కితాబులు, మరో వైపు రాష్ట్రానికి అన్యాయం అంటూ ఉత్తుత్తి నిరసనలతో వారు జుగుప్సాకరంగా వ్యవహరించారన్నారు. కేంద్రం ఏపీకి అన్యాయం చేసిందంటూ తెలుగుదేశం ఎంపీ సుజనా చౌదరి రాజ్యసభలో ప్రసంగిస్తే….మంత్రి కేంద్ర బడ్జెటను వ్యతిరేకిస్తూ ఎలా మాట్లాడతారంటూ వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడంలోనే ఏపీ ప్రయోజనాల పట్ల వారికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్ధమౌతోందని జేసీ విమర్శించారు.