2014 తీర్పు పునరావృతం కానుంది: మంత్రి గంటా

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 12:19 PM
 

విశాఖ: 2019 సాధారణ ఎన్నికల్లోనూ 2014 నాటి తీర్పు పునరావృతం కానుందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మునుగుతున్న పడవ లాంటిదని ఎద్దేవా చేశారు. జగన్‌ పాదయాత్ర ముగిసేలోగా మరికొందరు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి వెళ్లిపోతారని జోస్యం చెప్పారు. తాము మిత్రపక్షంలో ఉన్నా కేంద్రంతో పోరాడుతున్నామని అన్నారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పోరాటమని పేర్కొన్నారు. జగన్‌ బీజేపీతో పొత్తు కోసం ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జగన్‌ మరో నాటకానికి తెరదీశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసమని సాధారణ ఎన్నికల ముందు జగన్‌ రాజీనామా నాటకమాడుతున్నారని ఆరోపించారు. రాజీనామా అనేది కేవలం రాజకీయ నాటకం మాత్రమేనని పేర్కొన్నారు. రాజీనామా చేస్తానని చెప్పడం జగన్‌కు ఇదేమీ కొత్తకాదన్నారు. కేవలం ప్రజల దృష్టి మరల్చేందుకే రాజీనామా నాటకమాడుతున్నారని ఎద్దేవా చేశారు.