బాలచందర్ ఆస్తుల వేలం ప్రకటన

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 10:30 AM
 

ప్రముఖ సినీ దర్శకుడు, దివంగత బాలచందర్ ఆస్తులను వేలం వేయనున్నట్టు ఓ బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. సినీ రంగంలో ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన బాలచందర్ ఆస్తులు వేలానికి రావడం ఆయన అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె పుష్పా కందస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. బాలచందర్ కు చెందిన కవితాలయా సంస్థ నిర్మించిన ఓ టీవీ సీరియల్ కోసం ఆయన ఇల్లు, కార్యాలయాన్ని 2010లో యూకో బ్యాంకులో తాకట్టు పెట్టారని పుష్పా తెలిపారు. 2015లో సీరియల్ నిర్మాణ పనులను రద్దు చేశామని, డిజిటల్ నిర్మాణ పనులు చేపట్టామని ఆమె చెప్పారు. అప్పటి వరకు బ్యాంకు రుణంపై అసలుతో పాటు కొంతమేర వడ్డీని చెల్లించామని తెలిపారు. మిగిలిన మొత్తాన్ని ఒకేసారి చెల్లించేలా ప్రయత్నం చేస్తున్నామని... అయితే, ఇదే సమయంలో బ్యాంకు వేలం ప్రకటనను విడుదల చేసిందని చెప్పారు. ఈ విషయం పట్ల కలత చెందాల్సిన అవసరం లేదని... తాము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.