2018 బడ్జెట్‌ తర్వాత రాజకీయ దుమారం రేగింది: సోము వీర్రాజు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 12:15 PM
 

విజయవాడ: 2017 బడ్జెట్‌ తర్వాత సీఎం, కేంద్ర మంత్రులు ఎంతగానో మెచ్చుకున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికీ ఇవ్వనన్ని నిధులు ఏపీకి ఇచ్చారని అప్పుడు పొగిడారన్నారు. 2018 బడ్జెట్‌ తర్వాత మాత్రం రాజకీయ దుమారం రేగిందన్నారు. రాజధానిలో పరిపాలన భవనాల నిర్మాణాలకు కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని, వెంకయ్యనాయుడు మరో వెయ్యి కోట్లు ఇచ్చారని వివరించారు. ఏపీకి 16 వర్సిటీలు ఇచ్చామన్నారు. రాజధాని నిర్మాణం గురించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏదైనా ప్లాన్‌ ఉందా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను పరిశీలించాలని మాత్రమే చట్టంలో ఉందన్నారు. ప్రత్యేక హోదా రాలేదని ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోవడం లేదన్నారు. రైల్వే జోన్‌, దుగరాజుపట్నం పరిశీలించాలని మాత్రమే బిల్లులో పెట్టారని పేర్కొన్నారన్నారు. రైల్వే జోన్‌ విషయంలో స్పష్టత లేకున్నా దాని ఏర్పాటుకు యత్నిస్తున్నామని తెలిపారు. బిల్లులో లేని అంశాలు చాలా చేశామన్నారు.


ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి రూ.2,500 కోట్లు ఇచ్చామని  అన్నారు. రూ.2,500 కోట్లు దేనికోసం ఖర్చు చేశారో చెప్పాలన్నారు. దక్షిణ భారతం పట్ల వివక్ష అని మాట్లాడడం సరికాదన్నారు. బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ మనకంటే దారుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులు ఎలా ఖర్చు పెట్టారు?.. రాయలసీమ, ఉత్తరాంధ్రలో నిధులు ఖర్చుకు రాష్ట్రం దగ్గర బ్లూ ప్రింట్‌ ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్రం రెవెన్యూ లోటు రూ.4,600 కోట్లుగా తేలిందని, కానీ ఏపీ సర్కారు రూ.16వేల కోట్లు అంటోందన్నారు. రుణమాఫీ, సంక్షేమం కూడా రెవెన్యూ లోటులో చూపారని పేర్కొన్నారు. రైల్వే జోన్‌, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీకి ఫిజిబిలిటీ లేదని కమిటీలు చెబుతున్నాయన్నారు. 10 ఏళ్ల సమయం ఉన్నా.. చట్టంలో ఉన్నవి చేస్తున్నామన్నారు. పోలవరం నిర్మాణానికి వంద శాతం నిధులివ్వాలని మాత్రమే చట్టంలో ఉందన్నారు. పోలవరానికి ఎప్పటిలోగా కట్టాలనే కాలపరిమితి ఏమీ లేదన్నారు. చంద్రన్న కానుక, తోఫా డబ్బులు ఎక్కడివో టీడీపీ చెప్పాలన్నారు.