కరణ్ నగర్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదుల కాల్పుల్లో జవాను మృతి

  Written by : Suryaa Desk Updated: Mon, Feb 12, 2018, 02:42 PM
 

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కరణ్ నగర్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు చేసిన కుట్రను సీఆర్పీఎఫ్ జవాన్లు భగ్నం చేశారు. ఆర్మీ క్యాంపులోకి సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఉగ్రవాదుల ప్రవేశాన్ని పసిగట్టిన భద్రతా బలగాలు.. వారిపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడ్నుంచి ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఆర్మీ క్యాంపులో నివాసముంటున్న కుటుంబాలను ఉన్నతాధికారులు ఖాళీ చేయించారు. అక్కడున్న ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారు. రెండు రోజుల క్రితం సుంజ్వాన్ ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు సైనికులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టిన విషయం విదితమే.